
యువతను పెడదోవ పట్టిస్తున్న మాదకద్రవ్యాల నిర్మూలన, సముద్ర తీర ప్రాంతాల్లో భద్రత తదితర అంశాలపై చీరాల ఇంజినీరింగ్ కళాశాలలో (ఆటోనమస్) విశేష అవగాహన కార్యక్రమం జరిగింది. కొత్తపట్నం మెరైన్ పోలీస్ ఆధ్వర్యంలో విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన “సేఫ్ బీచ్ బాత్ & డ్రగ్స్ అవగాహన కార్యక్రమం” విజయవంతంగా ముగిసింది.

విశాఖ రేంజ్ ఐజీ శ్రీ జట్టి గోపీనాథ్ ఆదేశాల మేరకు, కోస్టల్ సెక్యూరిటీ పోలీస్ అదనపు ఎస్పీ శ్రీ జి.బి.ఆర్. మధుసూదన్ రావు, డిప్యూటీ ఎస్పీ శ్రీ జి. బాలి రెడ్డి పర్యవేక్షణలో పోలీసులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
సముద్ర స్నానాల్లో అప్రమత్తంగా ఉండాలి: కొత్తపట్నం మెరైన్ సీఐ ఈ సందర్భంగా కొత్తపట్నం మెరైన్ సీఐ శ్రీ బి. రమేష్ బాబు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, సముద్రంలో స్నానాలకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా భద్రతా నియమాలు పాటించాలని సూచించారు. ప్రమాదకరమైన, హెచ్చరికలు ఉన్న ప్రాంతాల్లోకి యువత వెళ్లకూడదని స్పష్టం చేశారు. అలాగే, డ్రగ్స్ మహమ్మారి బారిన పడితే వ్యక్తిగత ఆరోగ్యంతో పాటు కుటుంబాలు, సమాజం తీవ్రంగా నష్టపోతాయని, భవిష్యత్తును నాశనం చేసే ఇటువంటి వ్యసనాలకు యువత దూరంగా ఉండాలని హితవు పలికారు.

చట్టపరమైన చర్యలు తప్పవు.. డ్రగ్స్ & నార్కోటిక్ ఈగిల్ విభాగానికి చెందిన హెడ్ కానిస్టేబుల్ శ్రీ సురేష్ బాబు, పోలీస్ హెడ్ కానిస్టేబుల్ శ్రీ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే చట్టపరమైన, ఆరోగ్యపరమైన దుష్పరిణామాలను విద్యార్థులకు కూలంకషంగా వివరించారు. ఎక్కడైనా డ్రగ్స్ వినియోగం, విక్రయాలకు సంబంధించిన అనుమానాస్పద కార్యకలాపాలు గమనిస్తే తక్షణమే పోలీసులకు సమాచారం అందించాలని వారు కోరారు.
ఈ కార్యక్రమంలో కళాశాల యాజమాన్య సభ్యులు శ్రీ వేణు ప్రసాద్, సెక్రటరీ శ్రీ కొల్లిపర రవికుమార్, ప్రిన్సిపల్ శ్రీ వి.వి. కొండయ్య హాజరై విద్యార్థులను ఉత్సాహపరిచారు. వందలాదిగా పాల్గొన్న విద్యార్థులు పోలీసుల సూచనలను ఆసక్తిగా ఆలకించారు.bapatla news







