
విజయవాడ: అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ క్రీడాకారిణి బొల్లినేని చంద్రికకు రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) అండగా నిలిచింది. శాప్ చైర్మన్ రవి నాయుడు ఆమెను ఆసుపత్రిలో స్వయంగా పరామర్శించి, వైద్య ఖర్చుల నిమిత్తం రూ.1 లక్ష నగదును ఆర్థిక సాయంగా అందజేశారు.
ఆసుపత్రిలో చంద్రికను కలిసిన ఆయన వైద్యులను అడిగి ఆమె ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. పవర్ లిఫ్టింగ్‌లో అంతర్జాతీయ స్థాయిలో బహుళ పతకాలు సాధించి, రాష్ట్రానికి ఎంతో కీర్తి ప్రతిష్టలు తీసుకువచ్చిన చంద్రిక త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. క్రీడా మైదానంలో ఆమె చూపిన ధైర్యసాహసాలు నేటి యువతకు ఎంతో ఆదర్శమని ఈ సందర్భంగా కొనియాడారు.

అనంతరం శాప్ చైర్మన్ రవి నాయుడు మీడియాతో మాట్లాడుతూ.. క్రీడాకారుల సంక్షేమానికి, క్రీడల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని స్పష్టం చేశారు. ప్రతిభ ఉన్న క్రీడాకారులను గుర్తించి, వారిని అన్ని విధాలా ప్రోత్సహించడమే ప్రభుత్వ విధానమన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్రానికి పేరు తీసుకువచ్చే క్రీడాకారుల శ్రేయస్సు కోసం అవసరమైన సహాయ సహకారాలు అందించడంలో ఎటువంటి లోటు ఉండదని ఆయన భరోసా ఇచ్చారు.

చంద్రిక త్వరగా కోలుకుని తిరిగి క్రీడా రంగంలోకి ప్రవేశించాలని, భవిష్యత్తులో మరిన్ని పోటీల్లో విజయం సాధించి రాష్ట్రానికి మరింత వన్నె తీసుకురావాలని ఆకాంక్షించారు. యువ క్రీడాకారులు ఆమెను స్ఫూర్తిగా తీసుకుని క్రీడల్లో ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు.Ntrdistrict local news Telugu:ఎన్టీఆర్







