
- జూన్ నాటికి కాలువల అనుసంధానం
- నిర్వాసితులకు రూ.1900 కోట్ల పరిహారం పంపిణీ
- పోలవరం పనుల పరిశీలనలో రాష్ట్ర జలవనరుల శాఖామంత్రి నిమ్మల రామానాయుడు
ఏలూరు/పోలవరం: రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా పోలవరం ప్రాజెక్టు నిర్మాణ నాణ్యత, భద్రతా ప్రమాణాల విషయంలో ఎక్కడా రాజీ పడే ప్రసక్తే లేదని రాష్ట్ర జలవనరుల శాఖామంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. ఏలూరు జిల్లాలోని పోలవరం ప్రాజెక్టు పనులను ఆయన స్వయంగా పరిశీలించారు. పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్న అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ పలు కీలక విషయాలను వెల్లడించారు.
కొత్త డయాఫ్రం వాల్ పనులు ముమ్మరం గత ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టుకు అత్యంత కీలకమైన డయాఫ్రం వాల్ ధ్వంసమైందని మంత్రి గుర్తుచేశారు. ప్రజా భద్రత, ప్రాజెక్టు నాణ్యతను దృష్టిలో ఉంచుకునే పాతదాని స్థానంలో కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణాన్ని చేపట్టామని తెలిపారు. “మొత్తం 1372 మీటర్ల పొడవు నిర్మించాల్సి ఉండగా, ఇప్పటికే 1300 మీటర్ల మేర పనులు పూర్తయ్యాయి. ఈ నెలాఖరు నాటికి డయాఫ్రం వాల్ నిర్మాణం నూరు శాతం పూర్తవుతుంది,” అని ఆయన వెల్లడించారు. అలాగే, ఈసీఆర్‌ఎఫ్ (ECRF) డ్యాం నిర్మాణ ప్రాంతంలో నేలను గట్టిపరిచేలా వైబ్రో కాంప్యాక్షన్ పనులను కూడా విజయవంతంగా పూర్తి చేశామన్నారు. ఈ ఏడాది జూన్ నాటికి ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువల అనుసంధాన పనులను పూర్తి చేసేలా లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి వివరించారు.
నిపుణుల పర్యవేక్షణలోనే పనులు కేంద్ర జల సంఘం (CWC) ఆమోదించిన డిజైన్లు, అంతర్జాతీయ నిపుణుల ప్యానెల్ సూచనల మేరకే పోలవరంలో పనులు జరుగుతున్నాయని మంత్రి స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ (PPA) ప్రతిరోజూ ఈ పనులను పర్యవేక్షిస్తోందని, ప్రాజెక్టు పురోగతిని ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తున్నామని పేర్కొన్నారు. ప్రాజెక్టుల నిర్మాణంలో రాజీ పడకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని ఆయన తెలిపారు.
సాగునీటి రంగానికి పెద్దపీట పోలవరంతో పాటు రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాజెక్టులను సైతం ఒక క్రమపద్ధతిలో పూర్తి చేసేందుకు స్పష్టమైన యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశామన్నారు. సాగునీటి రంగానికి కూటమి ప్రభుత్వం ఎప్పుడూ పెద్దపీట వేస్తుందని ఆయన పునరుద్ఘాటించారు. నిర్వాసితుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, 2016లో చంద్రబాబు రూ. 700 కోట్ల పరిహారం అందించగా, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక రెండు దఫాలుగా రూ. 1900 కోట్లను పంపిణీ చేసినట్లు గుర్తుచేశారు. ప్రాజెక్టు నిర్మాణంపై వచ్చే సలహాలు, సూచనలతో పాటు విమర్శలను సైతం మనస్ఫూర్తిగా స్వీకరిస్తామని మంత్రి రామానాయుడు స్పష్టం చేశారు.http://ELURU DISTRICT NEWS







