
- బాపట్లలో ఉత్సాహంగా ‘మన వార్డు – మన ఎమ్మెల్యే’
- గల్లీ గల్లీ తిరిగి సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే నరేంద్ర వర్మ రాజు
- తక్షణ పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు
బాపట్ల: ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో నేరుగా తెలుసుకుని, వాటిని సత్వరమే పరిష్కరించే లక్ష్యంతో బాపట్ల ఎమ్మెల్యే శ్రీ వేగేశన నరేంద్ర వర్మ రాజు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మన వార్డు – మన ఎమ్మెల్యే’ కార్యక్రమం మంగళవారం ఉత్సాహంగా పునఃప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో భాగంగా 5వ రోజు బాపట్ల పట్టణంలోని రైలుపేట 4వ వార్డులో ఆయన విస్తృతంగా పర్యటించారు. తమ వార్డుకు స్వయంగా విచ్చేసిన ఎమ్మెల్యేకు స్థానిక ప్రజలు నీరాజనాలు పట్టి, పూలమాలలతో ఘనస్వాగతం పలికారు.

సమస్యల పరిష్కారానికి క్షేత్రస్థాయి పరిశీలన వార్డులో గల్లీ గల్లీ తిరిగిన ఎమ్మెల్యే నరేంద్ర వర్మ రాజు ప్రజలతో మమేకమై వారి రోజువారీ ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా డ్రైనేజీ వ్యవస్థ మెరుగుదల, తాగునీటి సరఫరా, వీధి దీపాల ఏర్పాటు, సిమెంట్ రోడ్ల మరమ్మతులు తదితర మౌలిక వసతుల సమస్యలను స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ప్రజల విన్నపాలపై తక్షణమే స్పందించిన ఆయన.. పర్యటనలో తన వెంట ఉన్న మున్సిపల్ అధికారులను పిలిచి సమస్యలను అక్కడికక్కడే పరిశీలించారు. వాటిని ప్రాధాన్యతా క్రమంలో వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

ప్రతి మంగళవారం ఒక వార్డులో పర్యటన ఈ సందర్భంగా ఎమ్మెల్యే నరేంద్ర వర్మ రాజు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి ఆశయాల మేరకు ప్రభుత్వ సేవలను ప్రజల గడప వద్దకే చేర్చడమే తన ప్రధాన లక్ష్యమని పునరుద్ఘాటించారు. ఇకపై వారంలో ప్రతి మంగళవారం ఒక వార్డు చొప్పున పర్యటిస్తానని, పట్టణంలోని ప్రతి సమస్యను పరిష్కరించే వరకు విశ్రమించబోనని స్పష్టం చేశారు. తాము కేవలం మాటలకూ, హామీలకే పరిమితం కాకుండా, చేతల్లో అభివృద్ధిని చేసి చూపిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో బాపట్ల పట్టణ మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి, పట్టణ అధ్యక్షుడు గొలపల శ్రీనివాసరావు, యూనిట్ ఇన్‌ఛార్జ్ పరిశా రమేష్ గౌడ్, వార్డ్ ప్రెసిడెంట్ అద్దంకి సోమశేఖర్, మున్సిపల్ అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.Bapatla Local News







