
- కేవలం మంగళ, బుధవారాల్లోనే అందుబాటులో చైర్మన్
- దూర ప్రాంతాల నుంచి వచ్చే బాధితులకు పడిగాపులు.. నిరాశ
- కమిషన్ పనితీరు మారాలంటున్న దళిత, సామాజిక సంఘాలు
జగ్గయ్యపేట (ఎన్టీఆర్ జిల్లా): రాష్ట్రంలో దళితుల హక్కులను కాపాడాల్సిన అత్యంత కీలకమైన సంస్థ ‘ఎస్సీ కమిషన్’ పనితీరు తీవ్ర విమర్శల పాలవుతోంది. కమిషన్ చైర్మన్ కార్యాలయం వారంలో కేవలం రెండు రోజులు మాత్రమే బాధితులకు అందుబాటులో ఉంటుండటంపై సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. దళితులపై అన్యాయాలు, వివక్ష ఘటనలు పెరుగుతున్న తరుణంలో కమిషన్ ఈ స్థాయిలో అలసత్వం ప్రదర్శించడంపై సామాజిక సంఘాలు మండిపడుతున్నాయి.
వారంలో ఎనిమిది గంటలే.. జగ్గయ్యపేటలోని చైర్మన్ కార్యాలయంలో ఆయన ప్రతి వారం మంగళ, బుధవారాల్లో మాత్రమే అందుబాటులో ఉంటున్నారని సమాచారం. ఆ రెండు రోజుల్లోనూ ఉదయం 11:00 గంటల నుంచి మధ్యాహ్నం 3:00 గంటల వరకు మాత్రమే కార్యాలయంలో ఉంటున్నారు. అంటే, బాధితుల సమస్యలు వినడానికి చైర్మన్ వారంలో కేవలం ఎనిమిది గంటల పాటు మాత్రమే కేటాయిస్తుండటం గమనార్హం.
బాధితులకు తప్పని నిరాశ.. న్యాయం కోసం రాష్ట్రంలోని వివిధ మూలల నుంచి వందల కిలోమీటర్లు ప్రయాణించి వచ్చే బాధితులు.. ఈ పరిమిత సమయాల కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గంటల తరబడి వేచి చూసి, చైర్మన్‌ను కలవలేక చివరికి నిరాశతో వెనుదిరుగుతున్నారు. ఒకవేళ ఆ రెండు రోజుల్లో కూడా చైర్మన్ వేరే పనుల వల్ల అందుబాటులో లేకపోతే, బాధితులు న్యాయం కోసం మళ్లీ మరో వారం వేచి చూడాల్సిన దయనీయ పరిస్థితి నెలకొంది.
ప్రజల సమస్యలు రోజులు చూసి వస్తాయా? ప్రభుత్వమే నియమించిన కీలక పదవిలో ఉన్న చైర్మన్.. ప్రజలకు ఇంత పరిమితంగా మాత్రమే అందుబాటులో ఉండటం కమిషన్ ఉద్దేశ్యాన్నే ప్రశ్నార్థకం చేస్తోందని పలువురు పెదవి విరుస్తున్నారు. “ప్రజల సమస్యలు రోజులు, సమయాలు చూసుకుని రావు. అలాంటప్పుడు కమిషన్ కేవలం రెండ్రోజులే ఎలా పనిచేస్తుంది?” అని సామాజిక వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. దళితులకు నిజమైన న్యాయం జరగాలంటే ఎస్సీ కమిషన్ పనితీరు, కార్యాలయ సమయాల్లో తక్షణమే మార్పులు రావాలని డిమాండ్ చేస్తున్నాయి.http://NTR DISTRICT NEWS







