
తెనాలి (గుంటూరు జిల్లా): సామాన్యులనే కాకుండా గ్యాస్ కొరత కష్టాలు ఇప్పుడు దేవాదాయ శాఖ ఆలయాలకు సైతం తప్పడం లేదు. గుంటూరు జిల్లా తెనాలిలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన వైకుంఠపురం (శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానం)లో గ్యాస్ కొరత తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యంలో ఆలయంలో ప్రతిరోజూ భక్తుల కోసం నిర్వహించే ‘నిత్య అన్నదాన’ కార్యక్రమాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి (ఈవో) అనుపమ ఒక ప్రకటనలో వెల్లడించారు.

గ్యాస్ కొరత కారణంగా భారీ ఎత్తున వంట చేయడం సాధ్యం కానందున.. తప్పనిసరి పరిస్థితుల్లో రేపటి నుంచి అనగా ఈ నెల 14వ తేదీ (శనివారం) నుండి అన్నప్రసాద వితరణను నిలిపివేస్తున్నట్లు ఆమె స్పష్టం చేశారు. తిరిగి గ్యాస్ సరఫరా పూర్తిస్థాయిలో పునరుద్ధరించబడిన వెంటనే, భక్తులకు యథావిధిగా నిత్య అన్నదాన కార్యక్రమాన్ని కొనసాగిస్తామని పేర్కొన్నారు. అప్పటివరకు భక్తులు ఈ అనివార్యమైన అసౌకర్యాన్ని గమనించి, ఆలయ అధికారులకు సహకరించాలని ఈవో అనుపమ విజ్ఞప్తి చేశారు.GUNTUR NEWS






