
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణకు కారకులైన అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతిని పురస్కరించుకుని, అమరావతిలోని శాఖమూరులో ఆయన 58 అడుగుల భారీ కాంస్య విగ్రహాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఘనంగా ఆవిష్కరించారు. అమరజీవి చేసిన 58 రోజుల నిరాహార దీక్షకు గుర్తుగా, 6.80 ఎకరాల విస్తీర్ణంలో ‘అమరజీవి-త్యాగ శిల్పం’ (స్టాట్యూ ఆఫ్ శాక్రిఫైస్) పేరుతో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, బీజేపీ ఏపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తో పాటు పలువురు మంత్రులు, ప్రజా ప్రతినిధులు పాల్గొని నివాళులర్పించారు.

సుమారు 26 టన్నుల కాంస్యం, 42 టన్నుల ఐరన్ స్ట్రక్చర్‌తో నిర్మించిన ఈ విగ్రహం అమరావతిలోనే తొలి భారీ శిల్పంగా రికార్డు సృష్టించింది. కేవలం 6 నెలల రికార్డు కాలంలోనే మొదటి దశ పనులు పూర్తి చేసుకున్న ఈ ప్రాజెక్టులో భాగంగా, రెండో దశలో మ్యూజియం, ఆడిటోరియం మరియు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను నిర్మించనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.Amaravathi news







