
కలెక్టరేట్, మార్చి 16: ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని జిల్లా సంయుక్త కలెక్టర్ (జేసీ) భావన వశిష్ఠ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్ (ప్రజా గరవాల పరిష్కార వేదిక) కార్యక్రమంలో ఆమె పాల్గొని అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి, క్షేత్రస్థాయి విచారణ ద్వారా నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని సూచించారు. అనంతరం, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “రైతన్న మీకోసం” కార్యక్రమ గోడపత్రాలు, కరపత్రాలను ఆమె ఆవిష్కరించారు.

ఈ నెల 16 నుంచి ఆరు రోజుల పాటు (17, 18, 23, 24, 25 తేదీల్లో) సాగే ఈ కార్యక్రమం ద్వారా రైతులకు సాగు పద్ధతులు, అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్ మరియు ప్రభుత్వ మద్దతుపై అవగాహన కల్పిస్తామని తెలిపారు. గ్రామ సచివాలయాల స్థాయిలో ఎనిమిది మంది సభ్యులతో కూడిన బృందాలు రోజుకు 30 ఇళ్లను సందర్శించి రైతులలో చైతన్యం తీసుకురావాలని ఆదేశించారు. అలాగే, నేటి నుండి ఏప్రిల్ 29 వరకు జరిగే జాతీయ పశు వ్యాధి నియంత్రణ టీకాలను పశుపోషకులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో జి.గంగాధర్ గౌడ్, వ్యవసాయాధికారి విజయనిర్మల, డీఎంహెచ్ఓ విజయమ్మ తదితరులు పాల్గొన్నారు.TODAY BAPATLA NEWS







