
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఎల్పీజీ గ్యాస్ బుకింగ్స్ పేరుతో కొత్త తరహా సైబర్ మోసాలు వెలుగులోకి వచ్చాయి. ఈ మోసాల పట్ల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం గురువారం ఓ ప్రకటనలో తీవ్రంగా హెచ్చరించింది. సైబర్ నేరగాళ్లు ‘GAS BILL UPDATE APK’ వంటి హానికరమైన ఫైల్స్‌ను (Malicious Files) వాట్సాప్ ద్వారా వినియోగదారులకు పంపుతున్నారని, వీటిని డౌన్‌లోడ్ చేస్తే ప్రమాదంలో పడతారని అధికారులు తెలిపారు.

ఇలాంటి అనుమానాస్పద ఫైల్స్ లేదా అప్లికేషన్లను ఎట్టిపరిస్థితుల్లోనూ డౌన్‌లోడ్ లేదా ఇన్‌స్టాల్ చేయవద్దని ప్రభుత్వం స్పష్టం చేసింది. వీటి ద్వారా సైబర్ నేరగాళ్లు వినియోగదారుల ఫోన్‌లను హ్యాక్ చేసి, వ్యక్తిగత డేటా, బ్యాంకు ఖాతాల వివరాలను దొంగిలించే ప్రమాదం ఉందని అధికారులు వివరించారు. గ్యాస్ బుకింగ్స్ లేదా బిల్లు చెల్లింపుల కోసం కేవలం చమురు సంస్థల అధికారిక యాప్‌లు (official platforms) మాత్రమే ఉపయోగించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
సరఫరాకు ఢోకా లేదు.. వదంతులు నమ్మకండి
మరోవైపు, దేశవ్యాప్తంగా ఎల్పీజీ సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా చూసేందుకు అవసరమైన ఏర్పాట్లను మరింత పటిష్టం చేయాలని కేంద్రం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించింది. గ్యాస్ కొరతపై వదంతులు నమ్మవద్దని, ఆందోళనతో సిలిండర్లు బుక్ చేసుకోవద్దని కోరింది. గ్యాస్ సరఫరాను నిరంతరాయంగా కొనసాగించేందుకు పట్టణ ప్రాంతాల్లో 25 రోజులకు, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజులకు ఒకసారి బుకింగ్ చేసుకునేలా విరామాన్ని సవరించినట్లు ప్రభుత్వం తెలిపింది. గ్యాస్ సరఫరాకు ఢోకా లేదని భరోసా ఇస్తూనే, సైబర్ మోసాల పట్ల ప్రజలను జాగ్రత్తగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం కోరింది.http://JAATHIYA VARTHALU







