
తెనాలి: స్థానిక బోసురోడ్డులోని ప్రసిద్ధ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థాన సత్రం కమిటీ ఎన్నికలకు శుక్రవారం అధికారికంగా నోటిఫికేషన్ విడుదలైంది. ఆలయ ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎన్నికల అధికారి కార్యాలయాన్ని అధికారులు శాస్త్రోక్తంగా ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎన్నికల అధికారి సాదు ప్రతాప్ కుమార్, పరిశీలకులు కొత్తమాసు రమేష్ బాబు, గ్రంధి జయరామ కృష్ణ పాల్గొని ఎన్నికల షెడ్యూల్ వివరాలను వెల్లడించారు.

ఎన్నికల షెడ్యూల్ ప్రకారం, ఏప్రిల్ 1, 2 తేదీల్లో నామినేషన్లను స్వీకరిస్తారు. ఏప్రిల్ 4న నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉండగా, 5వ తేదీన స్క్రూటినీ నిర్వహించి తుది అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు. ప్రధాన ఎన్నికల ప్రక్రియ ఏప్రిల్ 26వ తేదీ ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతుందని ఎన్నికల అధికారి సాదు ప్రతాప్ వివరించారు. ఈ ఎన్నికలు సీక్రెట్ బ్యాలెట్ పద్ధతిలో నిర్వహిస్తామని, ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా 16 మంది అభ్యర్థులకు ఓటు వేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రక్రియ అంతా అత్యంత పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో జరిగేలా సభ్యులందరూ సహకరించాలని ఈ సందర్భంగా అధికారులు కోరారు.http://GUNTUR DISTRICT NEWS







