
గుంటూరు, మార్చి 23: ప్రపంచ క్షయ వ్యాధి (టీబీ) దినోత్సవాన్ని పురస్కరించుకుని గుంటూరు జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా సోమవారం కలెక్టరేట్లోని ఎస్.ఆర్. శంకరన్ సమావేశ మందిరంలో వైద్య ఆరోగ్య శాఖ రూపొందించిన అవగాహన గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, “టీబీ నిర్మూలనకు సమష్టి కృషి అవసరం” అనే నినాదంతో ఈ ఏడాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, వ్యాధి పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ర్యాలీలు, ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. టీబీ వ్యాధిగ్రస్తులను దూరం పెట్టకుండా వారికి భరోసా కల్పించాలని, సరైన సమయంలో పరీక్షలు చేయించుకుని వైద్యుల సూచనల మేరకు మందులు వాడితే ఈ వ్యాధిని పూర్తిగా నయం చేయవచ్చని ఆమె స్పష్టం చేశారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కె. విజయలక్ష్మి మాట్లాడుతూ.. రెండు వారాలకు మించి దగ్గు, జ్వరం, బరువు తగ్గడం వంటి లక్షణాలు ఉంటే వెంటనే ప్రభుత్వ ఆసుపత్రులలో ఉచితంగా లభించే పరీక్షలు మరియు మందులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. టీబీ రహిత భారత్ లక్ష్య సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, జిల్లా రెవిన్యూ అధికారి ఖాజావలి, డిప్యూటీ కలెక్టర్ గంగరాజు మరియు ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.http://GUNTUR LOCAL NEWS







