
అమరావతి/తాడేపల్లి: శెట్టిబలిజల పితామహుడు, గొప్ప సంఘ సంస్కర్త దొమ్మేటి వెంకటరెడ్డి సేవలు నేటి యువతకు ఎంతో ఆదర్శప్రాయమని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత కొనియాడారు. సోమవారం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి మంత్రి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహాత్మా గాంధీ కంటే ముందే వయోజన విద్య కోసం కృషి చేసిన మేధావి వెంకటరెడ్డి అని ప్రశంసించారు. 1853లో జన్మించిన ఆయన, అణగారిన వర్గాల అభ్యున్నతికి, విద్య వ్యాప్తికి అహర్నిశలు శ్రమించారని గుర్తుచేశారు.

1905లో బర్మాలో శెట్టిబలిజ సంక్షేమ సంఘాన్ని స్థాపించి, దాని ద్వారా అనేక ప్రాథమిక పాఠశాలలు, రాత్రి పాఠశాలలు మరియు గ్రంథాలయాలను నెలకొల్పారని మంత్రి వివరించారు. కోనసీమ ప్రాంతంలో శెట్టిబలిజల ఐక్యతకు కృషి చేయడమే కాకుండా, భారత స్వాతంత్ర్య సంగ్రామంలోనూ ఆయన చురుకైన పాత్ర పోషించారని పేర్కొన్నారు. దొమ్మేటి వెంకటరెడ్డి ఆశయ సాధనలో భాగంగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బీసీల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని ఆమె అన్నారు. శెట్టిబలిజల చిరకాల కోరికను మన్నించి, వెంకటరెడ్డి జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నందుకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్లకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, శెట్టిబలిజ సామాజిక వర్గ ప్రతినిధులు పాల్గొన్నారు.http://AMARAVATHI NEWS







