
విజయవాడ, మార్చి 24: ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ షౌకత్ హెచ్ మహమ్మద్ (63) అకాల మరణం పట్ల ఆంధ్రప్రదేశ్ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీ ఆలపాటి సురేశ్ కుమార్ తీవ్ర దిగ్భ్రాంతిని, సంతాపం వ్యక్తం చేశారు. గత కొంతకాలంగా స్వల్ప అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న షౌకత్, మంగళవారం తుదిశ్వాస విడిచారు. ఈ సందర్భంగా సురేశ్ కుమార్ మాట్లాడుతూ.. షౌకత్ మరణంతో తాను ఒక మంచి మిత్రుడిని, విలువైన సహచరుడిని కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశారు. 1985లో విశాఖపట్నంలో ‘డెక్కన్ క్రానికల్’ ద్వారా జర్నలిజం వృత్తిలోకి ప్రవేశించిన షౌకత్.. ఇండియన్ ఎక్స్‌ప్రెస్, టైమ్స్ ఆఫ్ ఇండియా, ఎకనామిక్ టైమ్స్ వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో కీలక బాధ్యతలు నిర్వహించారని గుర్తు చేసుకున్నారు. బిజినెస్ జర్నలిజంలో తనదైన ముద్ర వేసిన ఆయన, మలయాళ మనోరమ గ్రూపునకు చెందిన ‘ది వీక్’ పత్రికకు తమిళనాడు ప్రతినిధిగా, డెక్కన్ క్రానికల్‌లో బిజినెస్ ఎడిటర్‌గా, టీసీఎస్‌లో సీనియర్ కన్సల్టెంట్‌గా కూడా పనిచేశారు. తన చివరి అసైన్మెంట్గా విజయవాడలో టైమ్స్ ఆఫ్ ఇండియా స్పెషల్ కరెస్పాండెంట్‌గా సేవలందించారని పేర్కొన్నారు. వృత్తి పట్ల అపారమైన నిబద్ధత కలిగిన షౌకత్ మరణం జర్నలిజం రంగానికి తీరని లోటని పేర్కొంటూ, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. షౌకత్‌కు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.http://NTR DISTRICT NEWS







