
విశాఖపట్నం, మార్చి 24: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సింహాచలం శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి వార్షిక చందనోత్సవం (ఏప్రిల్ 20న) పురస్కరించుకుని, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పక్కాగా ఏర్పాట్లు చేయాలని జిల్లా ఇన్చార్జి మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ మీటింగు హాలులో స్థానిక ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులతో కలిసి ఆయన చందనోత్సవ సన్నద్ధతపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. చందనోత్సవానికి వచ్చే భారీ భక్తజనాన్ని దృష్టిలో ఉంచుకుని దర్శనం, రవాణా, తాగునీరు మరియు క్యూలైన్ల నిర్వహణలో ఎక్కడా లోటుపాట్లు లేకుండా చూడాలన్నారు.

ఈ సమావేశంలో ప్రభుత్వ విప్, పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు, తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు, ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు నేరుగా పాల్గొనగా, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వర్చువల్ విధానంలో హాజరై పలు సూచనలు చేశారు. జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్, పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి ఏర్పాట్ల పురోగతిని మంత్రికి వివరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి, సింహాచలం ఆలయ ఈవో వెంకటరావు, డీసీపీలు మేరీ ప్రశాంతి, మణికంఠ చందోలు, ఆర్డీవో సుధాసాగర్ మరియు ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.http://VISHAKAPATNAM NEWS







