
తెనాలి, మార్చి 24: తెనాలి పట్టణానికి పూర్వ వైభవం తీసుకువచ్చేలా అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసికట్టుగా పనిచేయాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. మంగళవారం తెనాలి మున్సిపల్ కార్యాలయంలో వివిధ విభాగాల అధికారులతో ఆయన కీలక సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ మరియు మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్ అశుతోష్ శ్రీవాస్తవతో కలిసి పాల్గొన్న మంత్రి, పట్టణంలో విభాగాల వారీగా జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించేలా యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.

పారిశుధ్య నిర్వహణ విషయంలో అధికారుల తీరుపై మంత్రి అసహనం వ్యక్తం చేస్తూ, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పక్కాగా ప్రణాళికలు అమలు చేయాలని సూచించారు. ముఖ్యంగా ఐతే నగర్ పార్క్ పెండింగ్ పనులను మే మొదటి వారానికల్లా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని స్పష్టమైన గడువు విధించారు. వర్షాకాలం దృష్ట్యా పట్టణ పరిధిలోని అన్ని డ్రెయిన్లను యుద్ధ ప్రాతిపదికన ప్రక్షాళన చేయాలని అధికారులను ఆదేశించారు. తెనాలి రూపురేఖలు మార్చేందుకు ప్రతి ఒక్కరూ నిబద్ధతతో పనిచేయాలని ఆయన స్పష్టం చేశారు.http://GUNTUR LOCAL NEWS







