
విశాఖపట్నం, మార్చి 24: ట్రాన్స్‌జెండర్లు సమాజంలో గౌరవంగా, స్వయం సమృద్ధిగా జీవించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి స్పష్టం చేశారు. మంగళవారం విశాఖపట్నంలో ట్రాన్స్‌జెండర్ల స్వయం ఉపాధి పథకంలో భాగంగా సబ్సిడీపై ఆటోలను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ట్రాన్స్‌జెండర్లను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని వివరించారు. ఇప్పటికే విశాఖపట్నంలో 20 మంది ట్రాన్స్‌జెండర్లను కేజీహెచ్ (KGH) శానిటేషన్ సూపర్‌వైజర్లుగా నియమించామని, మరికొంతమందిని గుర్తించి త్వరలోనే ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు.
ట్రాన్స్‌జెండర్ల సౌకర్యార్థం వారికి ప్రత్యేక గుర్తింపు కార్డులు అందజేస్తున్నామని, సింగిల్ రేషన్ కార్డులు ఇచ్చేందుకు ప్రభుత్వం తగిన చర్యలు చేపడుతోందని మంత్రి తెలిపారు. వారి అభివృద్ధి కోసం స్వయం సహాయక బృందాల (Self Help Groups) ఏర్పాటును ప్రోత్సహిస్తున్నామని, అలాగే మహిళలతో పాటు ట్రాన్స్‌జెండర్లకు కూడా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించామని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం ట్రాన్స్‌జెండర్ల సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిస్తోందని, వారిని ప్రధాన స్రవంతిలోకి తీసుకువచ్చేందుకు అన్ని విధాలా అండగా ఉంటామని మంత్రి బాల వీరాంజనేయస్వామి పునరుద్ఘాటించారు.http://VISHAKAPATNAM NEWS







