
ఏలూరు జిల్లా, పెదవేగి:– కేంద్ర ప్రభుత్వం 1950 నాటి రాష్ట్రపతి ఉత్తర్వులను వెంటనే రద్దు చేసి, దళిత క్రైస్తవులకు మరియు దళిత ముస్లింలకు ఎస్సీ (SC) హోదా కల్పించాలని దళిత సేన వ్యవస్థాపక అధ్యక్షులు జిజ్జువరపు రవి ప్రకాష్ డిమాండ్ చేశారు.
ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం, పెదవేగి మండలం అమ్మపాలెంలో బుధవారం మధ్యాహ్నం జరిగిన దళిత సేన మహిళా కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా రవి ప్రకాష్ మాట్లాడుతూ.. దళిత క్రైస్తవులపై సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పును నిలుపుదల చేసి, దానిపై పునర్ సమీక్ష చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
మతం వేరు.. కులం వేరు: రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ప్రకారం ప్రతి పౌరుడికి నచ్చిన మతాన్ని ఆచరించే, ప్రచారం చేసుకునే స్వేచ్ఛ ఉందని ఆయన గుర్తు చేశారు. కులం ప్రాతిపదికన దళితులకు రాజ్యాంగం కల్పించిన హక్కులు, వారు ఏ మతాన్ని స్వీకరించినా కొనసాగాలని ఆయన వాదించారు. కులం వేరు, మతం వేరు అని, కేవలం మతం మారినంత మాత్రాన కులపరమైన వెనుకబాటుతనం పోదని ఆయన స్పష్టం చేశారు.Eluru Local News
దళిత క్రైస్తవ, దళిత ముస్లింలకు ఎస్సీ హోదా కల్పించే వరకు తమ పోరాటం ఆగదని రవి ప్రకాష్ హెచ్చరించారు. ఈ మేరకు పార్లమెంటులో ప్రత్యేక బిల్లును ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
ఈ సమావేశంలో ఏలూరు జిల్లా దళిత సేన మహిళా అధ్యక్షురాలు బేతాళ జయసుధ, జిల్లా కార్యదర్శి ముత్యాల ఝాన్సీ రాణి, దెందులూరు నియోజకవర్గం అధ్యక్షురాలు రే మల్లె స్వర్ణకమలం, అమ్మపాలెం గ్రామ అధ్యక్షురాలు పానమాల మల్లేశ్వరి తదితరులతో పాటు పెద్ద సంఖ్యలో మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు.






