
తెనాలి: కొలకలూరు గ్రామంలో దళిత వర్గాలను అసభ్య పదజాలంతో దూషించి, సామాజిక మాధ్యమాల్లో వీడియో పోస్ట్ చేసిన నిందితుడు చల్ల నాగరాజును రూరల్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. తెనాలి కొత్తపేటలోని రూరల్ సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డిఎస్పి జనార్ధనరావు ఈ కేసు వివరాలను వెల్లడించారు. ఖాజీపేట గ్రామానికి చెందిన నాగరాజు, మద్రాసులో ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తుంటాడని, ఈ నెల 27న కొలకలూరు గ్రామ సెంటర్‌లోని అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాల వద్ద మద్యం మత్తులో దళిత వర్గాలను దూషిస్తూ వీడియో తీశాడని పోలీసులు తెలిపారు.

అంతకుముందు గ్రామానికి చెందిన వినోద్ అనే వ్యక్తితో జరిగిన స్వల్ప వాగ్వాదాన్ని మనసులో పెట్టుకుని నాగరాజు ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు విచారణలో తేలింది. ఈ ఘటనపై దళిత వర్గాలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టగా, తహసిల్దార్ గోపాలకృష్ణ మరియు పోలీసులు నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చి శాంతింపజేశారు. ఈ క్రమంలో నిందితుడిని అరెస్టు చేసి, రూరల్ సర్కిల్ కార్యాలయం నుండి రోడ్డుపై నడిపించి కోర్టులో హాజరుపరిచారు. ఈ సమావేశంలో రూరల్ సీఐ నాయబ్ రసూల్, ఎస్ఐ ఆనంద్ మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.http://GUNTUR NEWS







