
మంగళగిరి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ నూతన చైర్ పర్సన్‌గా వేటుకూరి ఏవిఎస్ సూర్యనారాయణ రాజు సోమవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. మంగళగిరిలోని రాష్ట్ర కార్యాలయంలో కమిషన్ సెక్రటరీ ఉమాదేవి సమక్షంలో ఆయనతో పాటు మరో ఆరుగురు సభ్యులు—కే.జీ వెంకట పద్మలత, డా. ధోని శ్రీనివాస్ మూర్తి, ఉండవల్లి గాంధీ బాబు, చల్ల మధుసూదన రావు, మండల గంగ సూర్యనారాయణ, మరియు పి.నాగ మానసలు బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా సెక్రటరీ మరియు కార్యాలయ సిబ్బంది నూతన కార్యవర్గానికి ఘనంగా స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు.
బాధ్యతల స్వీకరణ అనంతరం చైర్ పర్సన్ సూర్యనారాయణ రాజు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని బాలల బంగారు భవిష్యత్తుకు బాటలు వేసేలా కమిషన్ కృషి చేస్తుందని స్పష్టం చేశారు. సభ్యులందరి సమన్వయంతో బాలల హక్కుల పరిరక్షణలో ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అగ్రస్థానంలో నిలుపుతామని, రాష్ట్ర మరియు జిల్లా స్థాయి అధికారుల సహకారంతో ఏపీని ‘చైల్డ్ ఫ్రెండ్లీ స్టేట్’గా తీర్చిదిద్దుతామని ధీమా వ్యక్తం చేశారు. ఎక్కడైనా బాలల హక్కులకు భంగం వాటిల్లితే ప్రజలు తక్షణమే కమిషన్ దృష్టికి తీసుకురావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.http://GUNTUR NEWS







