
నాయుడుపేటలో జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మత్స్యకారుల సంక్షేమం మరియు తీర ప్రాంత రక్షణపై కీలక ప్రకటనలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు ఉన్న సుదీర్ఘ తీర ప్రాంతం మరియు మత్స్య సంపద కేవలం స్థానిక జాలర్లకే చెందాలని ఆయన స్పష్టం చేశారు. పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, పుదుచ్చేరి నుండి వచ్చే జాలర్లు ఏపీ జలాల్లో చేపల వేట సాగించకుండా కఠిన నిఘా ఏర్పాటు చేస్తామని, ఇందుకోసం నెల్లూరు తీర ప్రాంతానికి తక్షణమే రెండు గస్తీ బోట్లను మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు. అవసరమైతే మరో నాలుగు బోట్లను కూడా కేటాయిస్తామని పేర్కొన్న సీఎం, ఈ విషయంలో స్థానిక మత్స్యకారులకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా చూడాల్సిన బాధ్యతను నెల్లూరు, తిరుపతి జిల్లాల కలెక్టర్లకు అప్పగించారు.

గత ప్రభుత్వం తీర ప్రాంత నిఘాను నిర్లక్ష్యం చేసిందని మండిపడుతూ, గతంలో తాము ఏర్పాటు చేసిన బోట్లను వైసీపీ పాలనలో నాశనం చేశారని విమర్శించారు. మత్స్యకారుల ప్రయోజనాల కోసం గత ప్రభుత్వం తెచ్చిన వివాదాస్పద జీవో నంబర్ 217ను ఇప్పటికే రద్దు చేశామని గుర్తుచేశారు. అంతేకాకుండా, చేపల వేట నిషేధ సమయంలో ఇచ్చే ఆర్థిక సాయాన్ని ‘మత్స్యకారుల భరోసా’ పథకం ద్వారా రూ. 20 వేలకు పెంచామని, దీని కోసం రూ. 259 కోట్ల నిధులను 1.29 లక్షల మత్స్యకార కుటుంబాల ఖాతాల్లో జమ చేశామని ముఖ్యమంత్రి వివరించారు. రాష్ట్ర మత్స్యకారుల పొట్టకొట్టే ఏ శక్తినైనా ఉపేక్షించబోమని, వారికి అండగా ఉంటామని చంద్రబాబు నాయుడు భరోసా ఇచ్చారు.http://AMARAVATHI NEWS







