ఆంధ్రప్రదేశ్అమరావతి

మనమిత్రను ప్రపంచంలోనే మెరుగ్గా తీర్చిదిద్దుతాం!

జూన్ 30 నాటికి వాట్సాప్ ద్వారా 500 రకాల పౌరసేవలు

వందరోజుల్లో ఎఐ ఆధారిత వాయిస్ ఎనేబుల్ సేవలు తెస్తాం

వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో అవసరమైన చట్టసవరణలు చేస్తాం

ప్రజల జేబుల్లోకి ప్రభుత్వాన్ని తేవాలన్నదే మనమిత్ర లక్ష్యం

ఇకపై కార్యాలయాల చుట్టూ తిరిగే పనిలేకుండా శాశ్వత పత్రాలు

శాసనసభలో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి లోకేష్

అమరావతి: ఈ ఏడాది జూన్ 30నాటికి 500 రకాల ప్రభుత్వ సేవలను మనమిత్రలో వాట్సాప్ ద్వారా అందిస్తామని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. వాట్సాప్ గవర్నెన్స్ పై శాసనసభలో జరిగిన లఘు చర్చలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ… 1983కి వెళితే ఎన్టీఆర్ సిఎం అయిన వెంటనే పటేల్, పట్వారీ రద్దుచేసి పరిపాలనను ప్రజలముందుకు తీసుకెళ్లారు. చంద్రబాబునాయుడు సింగపూర్ సిటిజన్ సర్వీస్ సెంటర్ ద్వారా ప్రేరణ పొంది ఈ-సేవ సర్వీసులను ఎలక్ట్రిసిటీ బిల్ తో ప్రారంభించి, అనేకరకాల సేవలకు విస్తరించారు. తర్వాత మీ సేవగా మారింది. ప్రజలవద్దకు పాలన, ప్రజలవద్దకు వెళ్లి సమస్యలు తెలుసుకోవాలని చంద్రబాబు పదేపదే చెప్పేవారు. స్టాన్ ఫోర్డ్ ఎంబిఎ ద్వారా టెక్నాలజీ తెలసుకున్నా, ప్రజాసమస్యలను నేరుగా పాదయాత్ర తెలుసుకున్నా. ఆనాడు గ్రామగ్రామాన ప్రజలను కలిసినపుడు ఆఫీసుల ముందు పడిగాపులు పడాల్సి వస్తోందని చెప్పారు. బటన్ నొక్కితే సినిమా టిక్కెట్లు, స్విగ్గీ ఫుడ్, నిత్యావసర వస్తువులు, ట్యాక్సీ వంటి అన్ని సేవలు ఇంటికి వస్తున్నపుడు ప్రభుత్వ సేవలు ఎందుకు రావడం లేదని ప్రజలు నన్ను ప్రశ్నంచారు. ఆఫీసులకు వెళితే డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని, గంటల తరబడి నిలబడాల్సి వస్తుందని సామాన్య ప్రజలు అక్కడకు వెళ్లడానికి ఇష్టపడటం లేదు. ఆఫీసులకు వెళ్తే మెరుగైన సేవలు అందకపోగా, లేనిపోని సమస్యలు వస్తాయని భావించేవారు. మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాలలో ఎక్కువ ఎంపిటిసిలు టిడిపి-జనసేన గెల్చుకున్నాం, ఎంపిపిగా బిసి మహిళకు రిజర్వేషన్ వస్తే ఆనాటి ఎమ్మెల్యే ఆమెకు కులధృవీకరణ పత్రం అందకుండా అడ్డుపడి, పదవికి దూరం చేశారు. ఆరోజే వ్యవస్థలో మార్పు తీసుకురావాలని నేను సంకల్పించుకున్నాను, అక్కడ నుంచే నాకు వాట్సాప్ గవర్నెన్స్ ఆలోచన మొదలైంది.గవర్నెన్స్ లో కీలక సంస్కరణలకు మనమిత్రతో నాంది ధనవంతులకు, పేదలకు తేడాలేకుండా నాణ్యమైన విద్య అందిస్తున్న తరహాలోనే ప్రభుత్వ సేవలు అందరికీ సమంగా అందించాల్సి ఉంది. ఇందుకోసం సుపరిపాలనపై చాలా అధ్యయనం చేశాను, విజిబుల్ గవర్నెన్స్ – ఇన్విజిబుల్ గవర్నమెంట్ నినాదం ద్వారా ప్రజల చేతిలో పరిపాలన ఉండాలన్నది నా ఆకాంక్ష. ప్రజల దైనందిన జీవితంలో అధికారులు, రాజకీయ నాయకుల అవసరం ఉండకూడదన్నదే నా లక్ష్యం. బేసిక్ సర్వీసెస్, వివిధరకాల సర్టిఫికెట్లను అధికారుల పాత్ర లేకుండా చేయాలనే ఆలోచనచేశాను. కొత్త యాప్ తో అవసరం లేకుండా అందరికీ అందుబాటులో ఉన్నవాట్సాప్ ద్వారా మనమిత్ర పేరుతో ప్రజలచేతిలోకి పాలన తెచ్చే లక్ష్యంతో సేవలు ప్రారంభించాం. పౌరసేలకు గేమ్ ఛేంజర్ గా మనమిత్ర పేరుతో సేవలకు శ్రీకారం చుట్టాం. ప్రస్తుతం 200 సేవలను మనమిత్ర ద్వారా అందిస్తున్నాం. ఇతర దేశాల్లో విధానాలను తెలసుకున్నపుడు ఎస్తోనియాలో ఈ గవర్నెన్స్ చాలా ముందుకు తీసుకెళ్లారు. సింగపూర్ లో స్మార్ట్ నేషన్ ఇనిషియేటివ్ కింద ఎఐ పవర్ తో సేవలు అందిస్తున్నారు. యుఎఇ లాంటి దేశాలు వాట్సాప్ ఆధారిత సేవలు అందజేస్తున్నారు. గవర్నెన్స్ లో విప్లవాత్మక సంస్కరణల అమలులో వాట్సాప్ గవర్నెన్స్ కీలక పాత్ర వహిస్తుందని మేం బలంగా నమ్ముతున్నాం.ఈనెలాఖరుకు మనమిత్ర ద్వారా 300 రకాల సేవలు రాబోయేరోజుల్లో వాయిస్ అనేబుల్ చేసి ఎఐని అనుసంధానంతో ఇంకా మెరుగైన సేవలు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ముఖ్యమంత్రి స్పీడ్ ఇప్పటికీ మేం అందుకోలేక పోతున్నాం. మనమిత్రకు సంబంధించి సెప్టెంబర్ 19, 2024న మెటాతో సమావేశమై, అక్టోబర్ 22, 2024న ఎంఓయు చేసుకున్నాం. జనవరి 30, 2025కి 150 రకాల ప్రభుత్వ సేవలు (రెవిన్యూ సర్టిఫికెట్, ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లింపు, గ్రీవెన్స్ సేవలు వంటివి) మనమిత్ర ద్వారా ప్రారంభించాం, ఈనెలాఖరుకు 300రకాల ప్రభుత్వ సేవలు వాట్సాప్ ద్వారా అందుబాటులోకి తేబోతున్నాం. ఎఐ చాటాబాట్ కూడా ఉపయోగించి మెరుగైన సేవలు ప్రజలకు అందించాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. మనమిత్ర సేవలు 3 కేటగిరిల్లో అందించాలని నిర్ణయించాం. ఒకటి ప్రజలకు నేరుగా అందించే సేవలు, 2వది హ్యుమన్ ఇంటర్వెన్స్ ద్వారా, 3వది సంస్కరణలను అమలు చేయడం ద్వారా సేవలు. ఇటీవల కదిరికి వెళ్లినపుడు ఒకసారి సర్టిఫికెట్ ఇచ్చాక మళ్లీమళ్లీ ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలకు ఎందుకురావాలని అడిగా. ఎటువంటి కొర్రీలు లేకుండా పర్మినెంట్ సర్టిఫికెట్ ఇవ్వాలని నిర్ణయించాం. క్లిష్టతరమైన సేవలను చట్టాలను సవరించి సర్వీసులను అందుబాటులోకి తెస్తాం.క్యూఆర్ కోడ్, ఎఐ అనేబుల్ తో మెరుగైన సేవలు నూతన విధానంలో వివిధ రకాల సర్టిఫికెట్లు ట్యాంపరింగ్ కు ఆస్కారం లేకుండా క్యూఆర్ కోడ్ అనేబుల్ సర్టిఫికెట్లు అందజేస్తాం. సెక్యూరిటీ పేపర్ పేరుతో పెద్దఎత్తున ప్రభుత్వ విభాగాల్లో డబ్బు ఖర్చవుతోంది. క్యూఆర్ కోడ్ అనేబుల్ తో ఆ డబ్బు ఆదా అవుతుంది. ఎపిపిఎస్ సి డాక్యుమెంట్ వెరిఫికేషన్ లో చాలా సమయం తీసుకుంటున్నట్లు మా పరిశీలనలో తెలిసింది. నూతన విధానంలో క్యూఆర్ కోడ్ ద్వారా వెరిఫికేషన్ సులభతరం చేస్తాం. పేమెంట్స్ అన్నీ ఇంటిగ్రేట్ చేసి ఒకే ప్లాట్ ఫాంపైకి తెచ్చాం. రాబోయే రోజుల్లో మరింత సులతరంగా ఎఐ చాట్ బాట్ ద్వారా బస్ టిక్కెట్లు, ఇతర సేవలను కేవలం వాయిస్ కాల్ తో అందేలా చేస్తాం. రాబోయే రోజుల్లో ఎఐ అనేబుల్ ద్వారా మెరుగైన, సౌకర్యవంతమైన సేవలు అందిస్తాం. ఇప్పుడు దేశవ్యాప్తంగా భాషలపై చర్చ జరుగుతోంది. కేవలం ఇంగ్లీషు, హిందీ, తెలుగు కాకుండా అన్నిభాషలకు ఇంటిగ్రేట్ చేసేలా చర్యలు తీసుకుంటాం. త్వరలో టిటిడి సేవలు కూడా మనమిత్రలోకి! ఇప్పటివరకు ఎండోమెంట్ లో 77సర్వీసులు అందుబాటులోకి తెచ్చాం. టిటిడి సేవలను కూడా మనమిత్ర పరిధిలోకి తేవాలని సిఎం సూచించారు. టిటిడి అధికారులతో చర్చించి 30రోజుల్లో టిటిడికి సంబంధించి అన్ని సర్వీసులను ఈ ప్లాట్ ఫాంపైకి తీసుకురాబోతున్నాం. మన మిత్రలో విద్యుత్ శాఖకు సంబంధించి ప్రస్తుతం 39సర్వీసులు అందిస్తున్నాం. పాత బిల్లుల బ్రేకప్, న్యూకనెక్షన్ కూడా దీనిద్వారానే ఇస్తున్నాం. ఎపిఎస్ ఆర్ టిసిలో పార్సిల్ బుకింగ్ తోసహా 13సర్వీసులు అందిస్తున్నాం. రెవిన్యూ శాఖలో 19సేవలు, మున్సిపల్ శాఖలో 29 సర్వీసులు పబ్లిక్ గ్రీవెన్స్ లో 6రకాల సేవలు, విద్యాశాఖకు సంబంధించి 5రకాల సేవలు, ఆర్ టిజి లో 10సర్వీసులు అందుబాటులోకి తెచ్చాం. జనవరి నుంచి ఇప్పటివరకు మనమిత్ర ద్వారా 51లక్షల ట్రాన్సాక్షన్స్ జరిగాయి. విద్యాశాఖలో అత్యధికంగా 25.80లక్షలు, రెవిన్యూశాఖలో 13లక్షల సేవలు అందించాం. మొత్తంగా వివిధ శాఖలకుసంబంధించి 25లక్షలమంది ప్రజలకు మనమిత్ర సేవలు అందాయి. మనమిత్రలో హాల్ టిక్కెట్స్ అందజేయడం మా సక్సెస్ స్టోరీకి నిదర్శనం. గతంలో స్కూలు వద్దకు వెళ్లి హాల్ టిక్కెట్ తెచ్చుకోవడం చాలా కష్టతరంగా ఉండేది. ఇంటిలో కూర్చుకొని హాల్ టిక్కెట్ నెంబర్ ఎంటర్ చేయడం ద్వారా లక్షలమంది విద్యార్థులు ఇంటినుంచే హాల్ టిక్కట్లు పొందారు. త్వరలో విద్యార్థుల రిజల్ట్స్ కూడా వాట్సాప్ ద్వారానే వారి ఫోన్లకు పంపిస్తాం. ఇలా ప్రతిసేవను రియల్ టైమ్ లో పుల్ అండ్ పుష్ మోడ్ లో ప్రజలకు అందిస్తాం. జనవరి 2025 నుంచి ఇప్పటివరకు జి టు సి (గవర్నమెంట్ టు సిటిజన్స్) అన్నివిభాగాల ద్వారా 1.23 కోట్ల ట్సాన్సాక్షన్ జరగగా, అందులో వాట్సాప్ ద్వారా (మనమిత్రలో) 41.4శాతం అందించగలిగాం. ప్రజలు సులభంగా సేవలు పొందుతున్నారు అనడానికి ఇదొక ఉదాహరణ.10సెకన్లలో సేవలు అందించాలన్నదే మా లక్ష్యం ప్రస్తుతం అందుబాటులో అధునాతన టెక్నాలజీ ఉంది, ప్రజలకు సేవ చేయాలనే తపన ఉంది, కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి. వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన డేట్ బేస్ ను ఇంటిగ్రేట్ చేసి, ఆధార్ సీడింగ్ ద్వారా పక్కాగా పౌర సేవలు అందజేయాలన్నది మా ప్రభుత్వ లక్ష్యం. ఈ సరికొత్త విధానంపై అవగాహనకు పెద్దఎత్తున ప్రచారం చేయాల్సి ఉంది. వేగవంతమైన డాటాతో కేవలం 10సెకన్లలో సర్వీసెస్ అందజేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. ఈ క్రమంలో సైబర్ సెక్యూరిటీ కూడా కీలకమైన విషయం. మనమిత్ర లాంచ్ చేసినపుడు కొందరు పేటిఎం గాళ్లు పోస్టులు పెడితే, విశాఖలో నేను చాలెంజ్ చేశా. ఎవరైనా హ్యాక్ అయినట్లు నిరూపిస్తే 10కోట్లు ఇస్తానని చెప్పాను. ఆ తర్వాత అటువైపునుంచి స్పందనలేదు. మాజీ సిఎం కు లేదన్నారు, ఆర్థికమంత్రి ఫోన్ పంపితే ఆయన కూడా వాట్సాప్ గవర్నెన్స్ గురించి నేర్చుకుంటారు. సరికొత్త విధానంలో మేం ఎక్కడా పర్సనల్ డాటా మెయింటెయిన్ చేయడం లేదు, ఇన్ క్రిప్టెడ్ రోడ్ మాత్రమే. ఆధార్ బేస్ అథెంటికేషన్ ఒటిపి ద్వారా చేస్తున్నాం. అది కూడా యుఐడి ద్వారానే చేస్తున్నాం. ప్రభుత్వం పాత్ర ఏమాత్రం లేదు. ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా చేయమని సిఎం చెప్పారు, ఆ కార్యక్రమం కూడా చేపడుతున్నాం.జూన్ 30కి మనమిత్ర ద్వారా 500 రకాల సేవలు కొందరు సభ్యులు లీగల్ వ్యాలిడిటీ ఉందా అని అడిగారు, కేంద్రప్రభుత్వం తెచ్చిన ఐటి యాక్ట్ ప్రకారం ఫిజికల్ డాక్యుమెంట్ తో ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్ సమానం. క్యూఆర్ కోడ్ బేస్డ్ అథెంటికేషన్ కు కూడా చట్టబద్ధత తెచ్చే అంశాన్నివచ్చే సమావేశాలకు సభముందుకు తెస్తాం. రాబోయే రోజుల్లో ప్రతి ప్రభుత్వ సేవ వాట్సాప్ ద్వారా అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. జూన్ 30 నాటికి 500 సర్వీసులు మనమిత్ర ప్లాట్ ఫాం ద్వారా అందుబాటులోకి తెస్తాం, ఎఐ అనేబుల్ కూడా చేస్తాం. ఫీడ్ బ్యాక్ మెకానిజం కూడా అందుబాటులోకి తెస్తాం. జి టు బి (గవర్నమెంట్ టు బిజినెస్) ఇన్సెంటివ్, పర్మిషన్లు వంటి సేవలను కూడా పారదర్శకంగా ఆన్ లైన్ ద్వారా చేయాలని సభ్యులు అడిగారు, ఇప్పటికే ఆ ప్రక్రియ ప్రారంభించాం. డాక్యుమెంట్ అప్ లోడ్ చేశాక ఎఐ ద్వారా రియల్ టైమ్ వెరిఫికేషన్ చేసి, వేగవంతమైన సేవలు అందిస్తాం. ఇందుకోసం కొన్ని సంస్కరణలు కూడా తీసుకురావాల్సి ఉంది. కొన్నింటికి సంబంధించి వెరిఫికేషన్ అథారిటీ ఎవరు అనే విషయమై కొంత సందిగ్ధత ఉంది. దీనివల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీనివల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుంది. ఈ సమస్యలను పరిష్కరించేందుకు వచ్చే అసెంబ్లీ సమావేశాల నాటికి కొన్ని చట్టాలను సవరణ చేయడం, కొన్ని కొత్తచట్టాలు చేయడం వంటివి చేయాల్సి ఉంది. ఈరోజు వాట్సాప్ గవర్నెన్స్ కు సంబంధించి ఇతర రాష్ట్రాలు మనల్ని ఆదర్శంగా తీసుకొని పోటీపడుతున్నాయి. ఎపిలో మనం ప్రారంభించిన 45రోజుల తర్వాత మహారాష్ట్ర ప్రభుత్వం కూడా మనవిధానాలను అధ్యయనం చేసి మెటాతో ఒప్పందం చేసుకుంది. ప్రస్తుతం పోటీ మొదలైంది. పోటీతత్వం ద్వారా ప్రజలకు మెరుగైన సర్వీసులు అందజేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. మీ-సేవ కేంద్రాల ద్వారా కూడా సమాంతర సేవలు పాదయాత్ర సమయంలో నన్ను మీ-సేవ ఆపరేటర్లు కలిశారు. గత ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాలను తెచ్చాక మీ-సేవ కేంద్రాల సేవలను కుదించారు. ప్రస్తుతం మీ-సేవలు కూడా ఐటి శాఖ పరిధిలోకి వచ్చాయి. మీ-సేవలను కూడా అందుబాటులోకి తెస్తామని ఆపరేటర్లకు హామీ ఇస్తున్నాం. సమాంతరంగా సచివాలయాలు, వాట్సాప్, మీ-సేవల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలను అందిస్తాం. ఈ నూతన విధానంపై త్వరలో ఎమ్మెల్యేలకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తాం. గ్రామ సచివాలయాల ద్వారా ప్రజలకు కూడా అవగాహన కల్పిస్తాం. సర్టిఫికేషన్ ఆరునెలల కోసారి రెన్యువల్ నిబంధనలు ఉన్నాయి, వచ్చే సమావేశాల్లో చట్టసవరణ చేసి పర్మినెంట్ సర్టిఫికెట్లు అందిస్తాం. క్యాస్ట్ సర్టిఫికెట్ల కోసం బిసి సోదరులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నేను పాదయాత్రలో స్వయంగా చూశా. దానికి ఫుల్ స్టాప్ పెట్టాలనే ఉద్దేశంతోనే శాశ్వత సర్టిఫికెట్లు తేవాలని నిర్ణయించాం. వాట్సాప్ మెసేజ్ ద్వారా ధాన్యం కొనుగోళ్లలో విధానాన్ని మంత్రి మనోహర్ తెచ్చారు. దానిని కూడా మనమిత్రకు అనుసంధానం చేస్తాం. వ్యవసాయ రంగ సేవలను కూడా ఈ పరిధిలోకి తెస్తాం.
వందరోజుల్లో అందుబాటులోకి వాయిస్ ఎనేబుల్ సేవలు మారుమూల గిరిజన ప్రాంతాల్లో బేసిక్ రిజిస్ట్రేషన్ జరగక ఆధార్ లేకపోవడంతో ప్రజలు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు సీనియర్ సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చెప్పారు. దీనిపై ట్రైబల్ వెల్ఫేర్ విభాగంతో చర్చలు జరుపుతున్నాం. డాటా ఇంటిగ్రేషన్ తర్వాత ఎక్కడ సమస్యలు ఉన్నాయో తెలుసుకొని ఆధార్ సీడింగ్ తో గిరిజనులకు రేషన్ కార్డులు అందిస్తాం. సిఎం గారు రియల్ టైమ్ గవర్నెన్స్ శాఖ నాకు ఇచ్చారు. అర్హులందరికీ రియల్ టైమ్ సేవలు అందించాలన్నదే ఆయన లక్ష్యం. గౌరవసభ్యులపై కూడా చాలా బాధ్యత ఉంది. నిరంతరం ప్రజల్లో తిరిగేటప్పుడు ఎక్కడ సమస్యలున్నాయో తెలియజేయాలి. అందరికీ సమానంగా ప్రజలకు మెరుగైన సేవలు అందించే లక్ష్యంతో పనిచేస్తున్నాం. ప్రభుత్వం అంటే కార్యాలయం కాదు… సేవ గుర్తుకు రావాలి. ఆఫీసు ప్రజల జేబులో ఉండాలన్నదే మన మిత్ర కాన్సెప్ట్ లక్ష్యం.. వందరోజుల్లో మనమిత్ర వర్షన్ 2.0 ఎఐ ద్వారా వాయిస్ ఎనేబుల్ విధానం తెస్తాం. అన్నిరంగాల్లో ఎపి నెం.1గా ఉండాలన్నది ముఖ్యమంత్రి లక్ష్యం. ఎస్తోనియా, యుఎఇ, సింగపూర్ విధానాలను అధ్యయనం చేస్తున్నాం. అధికారుల బృందాన్ని అక్కడకు పంపి స్టడీచేసి మనమిత్ర ద్వారా ప్రపంచంలోనే మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. మంత్రులపై కూడా బాధ్యత ఉంది. అందరం కలిసికట్టుగా పనిచేస్తేనే అనుకున్నది సాధించగలుగుతాం. అన్నిశాఖల సర్వీసులను వాట్సాప్ ఫస్ట్ (మనమిత్ర) ద్వారా అందిద్దాం. రాబోయే రోజుల్లో రాజకీయాల్లో ఇదొక కీలక సంస్కరణగా నిలవబోతోందని మంత్రి నారా లోకేష్ చెప్పారు. వాట్సాప్ గవర్నెన్స్ పై లఘుచర్చపై శాసనసభ్యులు ఆరుమిల్లి రాధాకృష్ణ (తణుకు), బొజ్జల సుధీర్ రెడ్డి (శ్రీకాళహస్తి), నజీర్ అహమ్మద్ (గుంటూరు తూర్పు), ఎన్. ఈశ్వరరావు (ఎచ్చెర్ల), లోకం మాధవి (నెల్లిమర్ల), ఆదిరెడ్డి శ్రీనివాస్ (రాజమండ్రి), ఆదినారాయణ రెడ్డి (జమ్మలమడుగు), కొణతల రామకృష్ణ (అనకాపల్లి), జివి ఆంజనేయులు (వినుకొండ), వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి (కోవూరు), బూర్ల రామాంజనేయులు (ప్రత్తిపాడు), విష్ణుకుమార్ రాజు పాల్గొన్నారు.

Author

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button