గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు బీసీ హాస్టల్ విద్యార్థి కిశోర్ చెరువులో పడి దుర్మరణం పాలవ్వడంపై రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విద్యార్థి మృతిపై విచారకరమని ఆవేదన వ్యక్తంచేస్తూ, విద్యార్థులపై పర్యవేక్షణ లేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన హాస్టల్ వార్డెన్ ను తక్షణమే సస్పెండ్ చేయాలని మంత్రి ఆదేశించారు. ఈ మేరకు గురువారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. పల్నాడు జిల్లా వెందుర్తి మండలం గంగలకుంట గ్రామానికి చెందిన బి.కిశోర్ గుంటూరుకు చెందిన వట్టి చెరుకూరు బీసీ హాస్టల్ లో తొమ్మిదో తరగతి చదువుతున్నాడన్నారు. ప్రమాదవశాత్తు గురువారం ఉదయం చెరువులో పడి కిశోర్ దుర్మరణం పాలవ్వడం బాధాకరమన్నారు. దుర్ఘటన జరిగిన వెంటనే మృతుడి తల్లిదండ్రులకు సమాచారమందించామన్నారు. హాస్టల్ విద్యార్థుల కదలికలపై దృష్టి పెట్టకుండా నిర్లక్ష్యం వహించిన వార్డెన్ శారదా రాణిని సస్పెండ్ చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. చేతికందికొచ్చిన కొడుకు మృతి చెందడం బాధాకరమని, మృతుడి తల్లిదండ్రుల కడుపుకోత వర్ణాతీతమని ఆవేదన వ్యక్తంచేశారు. విద్యార్థి తల్లిదండ్రులకు మంత్రి సవిత తన ప్రగాఢ సానుభూతి వ్యక్తంచేశారు. దుర్ఘటనకు గల కారణాలపై విచారణకు ఆదేశించామన్నారు.
235 Less than a minute