AP NEWS: పేదరికం లేని సమాజమే నా జీవితాశయం – తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో పాల్గొన్న సీఎం
UGADI FESTIVAL IN VIJAYAVADA
పేదరికం లేని సమాజమే తన జీవితాశయమని అందులో భాగంగానే పీ4 కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది పండుగ ప్రజలందరి జీవితాల్లో కొత్త వెలుగులు తేవాలని, సుఖసంతోషాలు వెల్లివిరియాలని ఆయన ఆకాంక్షించారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. తొలుత ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పద్మశ్రీ మాడుగుల నాగఫణి శర్మ నిర్వహించిన పంచాంగ శ్రవణంలో చంద్రబాబు పాల్గొన్నారు. టీటీడీ పంచాంగం సహా వ్యవసాయ శాఖ, ఉద్యానశాఖ పంచాంగాలను సీఎం ఆవిష్కరించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖ వార్షిక ఉత్సవాల క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర ప్రజలను ఉద్ధేశించి మాట్లాడారు. భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలు ఎంతో విశిష్టమైనవి. చరిత్రను మర్చిపోతే మనం ఉనికి కోల్పోతాం. ఉగాది అంటే మనకు గుర్తొచ్చేది పచ్చడి, పంచాంగ శ్రవణం. షడ్రుచుల మేళవింపు ఉగాది పచ్చడి. నాకు ఇంకా గుర్తుంది. చిన్న వయసులో రచ్చబండపై గ్రామస్తులంతా కూర్చుని ఉగాది శ్రవణం వినేవాళ్లం. మన సంప్రదాయాలు మరిచిపోకూడదనే ఉద్దేశంతో తెలుగు భాష, కళలకు ప్రాధాన్యత ఇచ్చే క్రమంలో ఆనాడు హైదరాబాద్‌లో హైటెక్ సిటీ పక్కన అవధాన కేంద్రం , అన్నమయ్య క్షేత్రం, శిల్ప కళా వేదిక ఏర్పాటు చేశాం. ఢిల్లీ ఏపీ భవన్, చెన్నై పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్‌లో ప్రభుత్వం తరపున ఉగాది వేడుకలు నిర్వహిస్తున్నాం.