AP NEWS: డా. బి. ఆర్. అంబేద్కర్ ఆశయాలను కొనసాగిద్దాం: మంత్రి కందుల దుర్గేష్
AP MINISTER KANDULA DURGESH
భారతరత్న డా. భీమ్‌రావు అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకొని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ నివాళులు అర్పించారు. భారత రాజ్యాంగాన్ని రూపొందించడంలో అంబేద్కర్ గారు కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు. ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగాన్ని రచించి ప్రజల అవసరాలు, హక్కులను తెలిపిన మహానుభావుడిగా అభివర్ణించారు. భారతదేశంలో అణగారిన కులాల సమానత్వం, సామాజిక న్యాయం కోసం తన జీవితాంతం పోరాడిన గొప్ప వ్యక్తి ప్రకటనలో పేర్కొన్నారు. అంటరానితనంపై ఎక్కుపెట్టిన ఆయుధం, దురహంకారంపై గొంతెత్తిన స్వరం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని వివరించారు. న్యాయశాఖ మంత్రిగా సామాజిక, ఆర్థిక సమస్యలను పరిష్కరించడానికి వివిధ చట్టాలు, సంస్కరణలు రూపొందించడంలో అంబేద్కర్ పాత్ర మరువలేనిది అన్నారు. న్యాయవాదిగా, ఆర్థికవేత్తగా, సామాజిక సంస్కర్తగా నవభారత వికాసానికి బాటలు వేసిన దార్శనికుడు, సర్వసమానత్వానికి కృషిచేసిన కారణజన్ముడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చేసిన పోరాటాలు అనన్య సామాన్యమని తెలిపారు.భారతదేశ సమాజానికి అంబేద్కర్ చేసిన సేవలను గౌరవించి ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్దాం అని ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ ప్రజానీకానికి సూచించారు.