వేసవిలో ప్రయాణికులకు, ప్రజలకు దాహం తీర్చేందుకు గుంటూరు నగరంలో 35 చలివేంద్రాలు ఏర్పాటు చేసినట్లు గుంటూరు నగరపాలక సంస్థ ఇంచార్జి మేయర్ షేక్ సజిలా తెలిపారు. శుక్రవారం హిందూ కాలేజీ జంక్షన్ లో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని కమిషనర్ పులి శ్రీనివాసులు, శాసన సభ్యులు గల్లా మాధవితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇంచార్జి మేయర్ మాట్లాడుతూ గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో చలివేంద్రాలను ఏర్పాటు చేయడం ద్వారా నగరానికి వచ్చే ప్రజల దాహార్తిని తీర్చుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు. కమిషనర్ మాట్లాడుతూ నగరంలో ప్రధాన సెంటర్లు, బస్ స్టాండ్ ల ప్రాంతాల్లో చలివేంద్రాలను ఏర్పాటు చేసి, అందులో త్రాగునీటిని అందించడానికి ఒకరు ఉండేలా చర్యలు తీసుకున్నామన్నారు. ఇప్పటికే 35 ప్రాంతాల్లో ఏర్పాటు చేశామని, అవసరమైతే మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఎంఎల్ఏ మాట్లాడుతూ గుంటూరు నగరానికి ప్రతి రోజు వేల సంఖ్యలో ఇతర ప్రాంతాల నుండి వివిధ పనుల కోసం వస్తుంటారని, ప్రస్తుత వేసవి దృష్ట్యా ప్రధాన సెంటర్లలో జిఎంసి చలివేంద్రాలు ఏర్పాటు చేయడం వారికి దాహం తీర్చుకోవడానికి వీలు కల్గుతుందన్నారు.
232 Less than a minute