AP NEWS: మీరంతా విజేతలు.. మీకు హ్యాట్సాఫ్..! మిమ్మల్ని చూసి చాలా గర్వపడుతున్నా!
FELICITATION FOR STUDENTS
మీరంతా ప్రభుత్వ విద్య పరువును కాపాడారని, ప్రభుత్వ కాలేజీల్లో చదివిన వారికి మంచి మార్కులు రావనే ముద్రను చెరిపేశారని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. మీరంతా విజేతలు.. మీకు హ్యాట్సాఫ్.. మీ అందరితో ఇలా కూర్చోవడం నా అదృష్టం.. మిమ్మల్ని చూసి చాలా గర్వపడుతున్నాని భావోద్వేగానికి గురయ్యారు. ప్రైవేటు ఇంటర్ కాలేజీలకు ధీటుగా ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో విద్యనభ్యసించి మార్కుల్లో రాష్ట్రస్థాయి టాపర్ లుగా నిలిచిన 52 మంది విద్యార్థులను “షైనింగ్ స్టార్స్-2025” పేరుతో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అభినందించి సన్మానించారు. ఉండవల్లి నివాసంలో జరిగిన “షైనింగ్ స్టార్స్-2025” కార్యక్రమంలో విద్యార్థులకు గోల్డ్ మెడల్ అందించి ల్యాప్ ట్యాప్ లను బహూకరించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. ఈ కార్యక్రమానికి విచ్చేసిన తల్లిదండ్రులకు, విద్యార్థులకు నా హృదయపూర్వక నమస్కారాలు. విద్యార్థుల విజయాన్ని సెలబ్రేటే చేసుకునేందుకు ఇక్కడకు రావడం జరిగింది. పేదరికం వల్ల విద్యార్థులు చదువుకు దూరం కాకూడదు. ప్రైవేటు పాఠశాలలు, కాలేజీలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలను తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చంద్రబాబుయనాయుడు ఆదేశించడం జరిగింది. జూనియర్ కాలేజీల విషయానికి వస్తే వైసీపీ ప్రభుత్వంలో మధ్యాహ్న భోజన పథకాన్ని రద్దు చేశారు. పాయకాపురంలో ఓ చెల్లితో మాట్లాడినప్పుడు.. తల్లిదండ్రులను కోల్పోయిన తనను చేపలమ్మి వాళ్ల అమ్మమ్మ చదివిస్తోందని, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని పునరుద్ధరించడం వల్ల ఆమెపై భారం తగ్గిందని చెప్పడం జరిగింది.