AP NEWS: రాష్ట్రంలో ఎక్కడా తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోండి: C.S
AP C.S MEETING WITH COLLECTORS
వేసవిలో రాష్ట్రంలో ఎక్కడా తాగునీటి సమస్య తలెత్తకుండా అవసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ జిల్లా కలక్టర్లను ఆదేశించారు. గురువారం రాష్ట్ర సచివాలయం నుండి తాగునీటి సరఫరాకు సంబంధించిన వేసవి కార్యాచరణ ప్రణాళిక, స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలపై జిల్లా కలక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా తాగునీటికి ఇబ్బంది లేకుండా అవసరమైన వేసవి కార్యాచరణ ప్రణాళికను పటిష్టంగా అమలు చేయాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో వేసవి నీటి ఎద్దడి ఉండే అవకాశం ఉన్న 332 మండలాల్లోని 3వేల 438 ఆవాసాలను గుర్తించి 67.31 కోట్ల రూ.లతో వేసవి కార్యాచరణ ప్రణాళిక అమలుకు చర్యలు తీసుకోవడం జరుగుతోందని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో వేడి వాతావరణ పరిస్థితులు,వేడి గాలులు వీచే అవకాశం ఉందని కావున వేడి గాలుల పరిస్థితులను అధికమించేందుకు తగిన సంసిద్ధత ముందు జాగ్రత్త కార్యాచరణ ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలని కలక్టర్లకు సిఎస్ సూచించారు. కరువు ప్రభావిత మండలాల్లో ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేయడంతో పాటు అవసరమైన చోట్ల ప్రైవేట్ తాగునీటి వనరులను అద్దెప్రాతిపదిక తీసుకుని ప్రజల తాగునీటి అవసరాలను తీర్చాలని ఆదేశించారు. అంతేగాక తాత్కాలిక నీటి సరఫరా వ్యవస్థల పునరుద్ధరణ, మరమ్మత్తులు,తాగునీటి చెరువులను నీటితో నింపడం, చేతి పంపులకు మరమ్మత్తులు నిర్వహించడం ద్వారా తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేయాలని ఆదేశించారు. రాష్ట్ర,జిల్లా స్థాయిలో ప్రత్యేక మానిటరింగ్ సెల్ లను ఏర్పాటు చేసి తాగునీటి సమస్యలపై ఫిర్యాదులను స్వీకరించి సకాలంలో వాటిపై స్పందించి తక్షణం పరిష్కరించాలని సిఎస్ ఆదేశించారు. అదే విధంగా తాగునీటికి సంబంధించి పబ్లిక్ గ్రీవియెన్స్ రిడ్రస్సల్ సిస్టమ్(పిజిఆర్ఎస్),వివిధ ప్రసార మాద్యమాలు,కరువు మానిటరింగ్ సెల్,కాంటాక్ట్ సెంటర్ టోల్-ఫ్రీ నంబర్ -1902 ద్వారా వచ్చే ఫిర్యాదులపై తక్షణం స్పందించి వాటిని సకాలంలో పరిష్కరించాలని సిఎస్ ఆదేశించారు.