GUNTUR NEWS: ‘కందుకూరి’ విశిష్ట పురస్కారం అందుకున్న సీనియర్ జర్నలిస్ట్‘పొగర్తి నాగేశ్వరరావు’
AWARD FOR SENIOR JOURNALIST POGARTI NAGESWARA RAO
నాటక రంగంలో అత్యుత్తమ సేవలందిస్తున్న కళాకారులు, సాంకేతిక నిపుణులు, రచయితలు, దర్శకులకు రాష్ట్ర ఫిలిం, టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రకటించిన కందుకూరి విశిష్ట పురస్కారాల్లో పొగర్తి నాగేశ్వరరావును జిల్లా స్థాయి పురస్కారం వరించింది. కందుకూరి విశిష్ట పురస్కారానికి గుంటూరుకు చెందిన ప్రముఖ కళాకారుడు, సీనియర్ జర్నలిస్టు పొగర్తి నాగేశ్వరరావు ఎంపికయ్యారు. రాష్ట్ర ఫిలిం, టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన తెలుగు నాటకరంగ దినోత్సవం కార్యక్రమంలో ఆయన ఈ పురస్కారాన్ని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్, రాష్ట్ర నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ, ప్రముఖ సినీ రచయిత, కందుకూరి పురస్కారాల ఎంపిక కమిటీ చైర్మన్ బుర్రా సాయి మాధవ్, ఎఫ్‌డీసీ మేనేజింగ్ డైరెక్టర్ హిమాన్షు శుక్ల చేతులమీదుగా అందుకున్నారు. ప్రభుత్వం నుంచి కందుకూరి పురస్కారం ప్రశంశా పత్రంతో పాటు రూ.10వేల నగదు బహుమతిని కూడా పొగర్తి నాగేశ్వరరావు అందజేశారు. గుంటూరు నగరానికి చెందిన పొగర్తి నాగేశ్వరరావు గత 26 సంవత్సరాలుగా సీనియర్ జర్నలిస్టుగా పలు ప్రముఖ దినపత్రికల్లో ఉన్నతస్థాయిలో పనిచేస్తూ అందరికీ చిరపరిచితులే.. ప్రవృత్తిగా నాటకరంగాన్ని ఎంచుకుని గత 18 ఏళ్లుగా ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలతో పాటు పలు సామాజిక, ప్రజా సమస్యలపై ఆధునిక నాటికల ప్రదర్శనలు ఇచ్చారు. తెలుగు నాటకరంగం నుంచి జాతీయ, అంతర్జాతీయ రంగ వేదికలపై జరిగిన సాంఘిక నాటిక, నాటక ప్రదర్శనల్లో పాల్గొంటూ ఓ విభిన్న నటుడిగా ప్రేక్షకుల మన్ననలు అందుకుంటున్నారు. అదేవిధంగా లఘుచిత్రాలు, సినిమాల్లోనూ నటిస్తూ ప్రత్యేక గుర్తింపు పొందుతున్నారు. రేడియో, దూరదర్శన్, ప్రైవేటు ఛానళ్లలో 60కి పైగా కార్యక్రమాల్లో నటించారు. నాటక రంగంలో ఆయన చేస్తున్న సేవలను గుర్తించి ఇది వరకే అనేక సంస్థలు నటభూషణ, ఉత్తమ నటుడు, ఉగాది ప్రతిభ, విశిష్ట పురస్కారాలను కూడా అందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎన్నడూ లేనంత ఆనందంతో నవ్వి నవ్వి.. కుర్చీలోంచి లేచి మరీ చప్పట్లు కొడుతూ సంబరపడటాన్ని ఇటీవల విజయవాడలో శాసనసభ, మండలి సభ్యుల క్రీడా పోటీల ముగింపు వేడుకల్లో చూశాం కదా.. స్పీకర్ అయ్యన్నపాత్రుడు, మంత్రులు నారా లోకేశ్, పయ్యావుల కేశవ్ సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు.. పొట్ట చెక్కలయ్యేలా నవ్వి హాస్యాన్ని ఆస్వాదించిన.. అద్భుతమైన సన్నివేశం ఆవిష్కృతమైన సంగతి తెలిసిందే కదా.. ఆ ఎమ్మెల్యేలు చేసిన “ఇదీ..సంగతి..” హాస్యవల్లరి రచయితగా గుంటూరుకు చెందిన సీనియర్ జర్నలిస్టు పొగర్తి నాగేశ్వరరావు పనిచేశారు. అందర్నీ నవ్వించి మెప్పించిన రచయితగా, సహాయ దర్శకునిగా పొగర్తి నాగేశ్వరరావును గుర్తించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వారి చేతుల గౌరవ సన్మానం చేశారు. ప్రభుత్వం తరఫున అదే కార్యక్రమంలో జ్ఞాపికను అందజేశారు. ప్రస్తుతం యూ ట్యూబ్, ఇన్ స్టా, ట్విట్టర్ సహా సోషల్ మీడియా ట్రెండింగ్ లో ఈ హాస్యవల్లరి సన్నివేశాలు చక్కర్లు కొడుతున్నాయి. కడుపుబ్బా నవ్వించిన ఈ సన్నివేశాలు జబర్దస్త్ ప్రోగ్రామ్ ను మించిన హాస్యాన్ని పండించాయని నెటిజన్లు చెబుతున్నారు. ప్రభుత్వం తరఫున ప్రతిష్టాత్మక కందుకూరి విశిష్ట పురస్కారానికి తనను ఎంపిక చేసినందుకు పొగర్తి నాగేశ్వరరావు సంతృప్తిని వ్యక్తం చేస్తూ… ఏపీ చలనచిత్ర టీవీ నాటకరంగ అభివృద్ధి సంస్థకు, అవార్డ్స్ ఎంపిక జ్యూరీ కమిటీకి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు అభిమానులు, మిత్రులు, శ్రేయోభిలాషులు, జర్నలిస్టులు, గుంటూరు నగర ప్రముఖులు పొగర్తి నాగేశ్వరరావును అభినందిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు.