GUNTUR NEWS: ప్రస్తుత డిజైన్‌తో ఇక్కట్లు తప్పవు – శంకర్ విలాస్ ఫ్లై ఓవర్ డిజైన్ మార్చాలి
NEW BRIDGE MEETING IN GUNTUR
రాబోయే వందేళ్లకు ప్రజల ట్రాఫిక్ అవసరాలు తీర్చే విధంగా శంకర్ విలాస్ ఫ్లై ఓవర్ నిర్మించాలని రాజకీయ పార్టీలు ముక్త కంఠంతో స్పష్టం చేశాయి. బెటర్ శంకర్ విలాస్ ఫ్లై ఓవర్ సాధన జెఎసి ఆధ్వర్యంలో అరండల్‌పేటలోని ఓ హోటల్లో శుక్రవారం రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వైసిపి, కాంగ్రెస్, బిజెపి, సిపియం, సిపిఐ, బిఎస్‌పి పార్టీల నాయకులు, మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు పాల్గొని ప్రస్తుత డిజైన్‌కు జెఎసి చేస్తున్న సవరణలకు సంపూర్ణ మద్దతు తెలిపాయి. జెఎసి నాయకులు ఎల్.ఎస్.భారవి అధ్యక్షతన జరిగిన సమావేశంలో మాజీ మంత్రి, వైసిపి జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు మాట్లాడుతూ ప్రభుత్వం ఆమోదించిన శంకర్ విలాస్ రైల్వే ఫ్లై ఓవర్ డిజైన్‌తో నగర ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు తీరకపోగా మరింత పెరుగుతాయని అన్నారు. గతంలో టిడిపి ప్రభుత్వంలో ఎంపి గల్లా జయదేవ్ హయాంలో రూపొందించిన డిజైన్ ప్రకారమే హిందూ కాలేజి నుండి లాడ్జి సెంటర్ వరకూ సింగిల్ పిల్లర్ ఫైఓవర్ నిర్మించాలని కోరారు. బడ్జెట్‌ను పరిమితులు విధించుకొని నిర్మిస్తే తర్వాత ప్రజలు ఇబ్బంది పడతారన్నారు. కేంద్రం ఇస్తున్న నిధులకు రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చి సమగ్రమైన ఫ్లై ఓవర్ నిర్మించాలని కోరారు. ఎంపిలు, ఎమ్మెల్యేలు పంతానికి పోకుండా ప్రజల ఇబ్బందుల్ని దృష్టిలో ఉంచుకొని డిజైన్ మార్చాలని విజ్ఞప్తి చేశారు. మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ ఇప్పుడున్న బ్రిడ్జి నిర్మించి దాదాపు 70 ఏళ్లు అయ్యిందని, నూతనంగా నిర్మించే బ్రిడ్జి మరో వందేళ్లు ఉండాలన్నారు. అలాంటప్పుడు భవిష్యత్‌లో ట్రాఫిక్‌ను దృష్టిలో ఉంచుకొని నిర్మించాలన్నారు. ముందుగా ఆర్‌యుబి నిర్మించాలన్నారు. రూ.98 కోట్లు ఏమాత్రం సరిపోవని, అదనపు నిధులు కేటాయించాలన్నారు. త్వరలో ఆర్‌అండ్‌బి మంత్రిని, లోకేష్‌ను కలిసి సమస్యను వివరిస్తామని చెప్పారు.కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు మస్తాన్‌వలి మాట్లాడుతూ తాము ఎవ్వరూ ఫ్లై ఓవర్‌కు వ్యతిరేకం కాదన్నారు. రాజధాని ప్రాంతంలో నిర్మిస్తున్న ఈ బ్రిడ్జిని చరిత్రలో గుర్తుండిపోయే విధంగా నిర్మించాలని, తప్పు జరిగితే మళ్లీ సరిదిద్దుకునే అవకాశం ఉండదన్నారు. బిజెపి నాయకులు రామకృష్ణ మాట్లాడుతూ ఇది రాజకీయ నాయకులు, పార్టీల సమస్య కాదని, ప్రజలందరి సమస్యని చెప్పారు. నిధులు అవసరం అయితే కేంద్రాన్ని కోరాలని, మంచి బ్రిడ్జి నిర్మించాలని కోరారు. సిపియం నగర కార్యదర్శి కె.నళినీకాంత్ మాట్లాడుతూ విజనరీ లీడర్ ఉన్న ప్రభుత్వం అని చెప్పుకుంటూ శంకర్ విలాస్ బ్రిడ్జిని మాత్రం విజన్ లేకుండా నిర్మిస్తున్నారి అన్నారు. ఈ డిజైన్‌తో బ్రిడ్జి నిర్మిస్తే నష్టాలే ఎక్కువ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వాలని కోరారు. సిపిఐ నగర కార్యదర్శి కె.మాల్యాద్రి మాట్లాడుతూ అందరం కలిసి బెటర్ బ్రిడ్జి నిర్మాణం కోసం కృషి చేద్దామని చెప్పారు. బిఎస్‌పి నాయకులు సిహెచ్.వాసు మాట్లాడుతూ డిజైన్ ఆమోదం పొందే వరకూ గోప్యం ఉంచారన్నారు. జెఎసి చేస్తున్న సవరణలు సహేతుకం అని, కావున జెఎసి నాయకులు, పౌర సంఘాలతో చర్చించాలని కోరారు. వైసిపి నగర అధ్యక్షులు నూరి ఫాతిమా, కార్పొరేటర్లు ఆచారి, అచ్చాల వెంకటరెడ్డి, గురవయ్య, ఆలిండియా లాయర్స్ యూనియన్ నాయకులు నర్రా శ్రీనివాసరావు, ఎల్‌ఐసి ఉద్యోగుల సంఘం నాయకులు వివికె.సురేష్, రేట్ పేయర్స్ అసోసియేషన్ నాయకులు నారాయణరెడ్డి, వల్లూరు సదాశివరావు, ఆటో యూనియన్ నాయకులు మురళి, షాప్స్ ఓనర్స్ అసోసియేషన్ నాయకులు బి.శ్రీనివాసరావు, సిఐటియు నాయకులు ముత్యాలరావు, ఎఐటియుసి హనుమంతరావు నాయకులు మద్దతు తెలిపారు.