
జూన్ 21వ తేదీన విశాఖపట్నంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. ఈవేడుకులకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. అందుకు సంబంధించి చేయాల్సిన ఏర్పాట్లపై బుధవారం విజయవాడలోని సిఎస్ క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ సంబంధిత శాఖల అధికారులతో ప్రాథమికంగా సమీక్ష నిర్వహించారు.ప్రధానమంత్రి మోడి సూచనలతో 2014 డిసెంబరులో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించగా 2015 జూన్ 21వ తేదీన మొదటి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రధాని మోడి చేతుల మీదుగా ప్రారంభించగా ఒకే వేదికపై 35,985 మంది యోగాసనాలు చేసి రెండు గిన్నిస్ రికార్డులు సాధించడం జరిగింది. ఇప్పటి వరకు 10 అంతర్జాతీయ యోగా దినోత్సవాలు నిర్వహించుకోవడమైంది. మే 2న ప్రధాని అమరావతికి వచ్చినపుడు 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను విశాఖపట్నంలో నిర్వహించాలని ఆ వేడుకలకు తాను హాజరవుతానని సభా వేదిక నుండి ప్రకటించారు. అందుకు అనుగుణంగా జూన్ 21న విశాఖలో “Yoga for One Earth,One Health” అనే నినాదంతో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేయనుంది. ఈ ఏడాది 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ప్రతి ఒక్కరి ఆరోగ్య పరిరక్షణలో యోగా ప్రాముఖ్యతపై అవగాహన తెచ్చేందుకు ఇప్పటికే మొరార్జీ దేశాయ్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ యోగా గత మార్చి 13 నుండి జూన్ 21 వరకు 100 రోజుల్లో 100 నగరాల్లో 100 ఆర్గనైజేషన్ల పేరిట గ్లోబల్ ప్రచార కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది.దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం “యోగాంధ్ర-2025” నినాదంతో ప్రజల్లో యోగాపట్ల అవగాహన కల్పించేందుకు పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటోంది.








