పొదుపు సంఘాలలోని 30 వేల కుటుంబాలకు జీవనోపాధులు కల్పించడం, వారి ఆర్థికాభివృద్ధికి బాటలు వేయడమే లక్ష్య: కలెక్టర్ వెంకట మురళి.
COLLECTOR MEETIG ON SHG GROUPS
పొదుపు మహిళల జీవనోపాధుల కార్యకలాపాలు, ఆర్థికాభివృద్ధి అంశాలపై మేఘో మధనం కార్యక్రమం బాపట్లలో గురువారం జరిగింది. డి ఆర్ డి ఏ, మెప్మాలోని క్షేత్రస్థాయి పట్టణ, గ్రామ సంఘాల నాయకులకు మెగా వర్క్ షాప్ నిర్వహించారు. వివిధ శాఖల ద్వారా అమలయ్యే పథకాలు, రాయితీలపై అవగాహన కల్పిస్తూ ఏర్పాటుచేసిన స్టాల్స్ ప్రదర్శన ఎంతగానో ఆకట్టుకుంది. సీడాప్ ద్వారా నిరుద్యోగ యువతకు నిర్వహిస్తున్న శిక్షణలు, ఉద్యోగ అవకాశాలపై రూపొందించిన గోడ పత్రాలను జిల్లా కలెక్టర్ విడుదల చేశారు. రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో రాష్ట్రంలోనే బాపట్ల జిల్లాను ప్రధమంగా నిలిపి ఏపీ గవర్నర్ చేతుల మీదుగా బంగారు పతకం, అవార్డు అందుకున్న జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళిని ఈ సందర్భంగా అధికారులు, గ్రామ సంఘాల నాయకులు ఘనంగా సన్మానించారు. పొదుపు మహిళలను ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను చేయాల్సిన బాధ్యత క్షేత్రస్థాయి సిబ్బందిపై ఉందని జిల్లా కలెక్టర్ చెప్పారు. వారంతా నికర ఆదాయం సాధించేలా చైతన్య పరచాలని ఆయన సూచించారు. పేదరికం నుంచి మహిళలను బయటకు తెచ్చేందుకు వివిధ సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. ప్రభుత్వం వెచ్చిస్తున్న రూ.కోట్ల నిధులను మహిళలకు చేరువయ్యేలా సహకరించాలన్నారు. అభివృద్ధి ఫలాలు పేద కుటుంబాలకు చేర్చాల్సిన బాధ్యత మీపైనే ఉందన్నారు. బాపట్ల జిల్లాలో 33 వేల 390 పొదుపు సంఘాలు ఉండగా అందులో నాలుగు లక్షల కుటుంబాలు సభ్యులుగా ఉన్నాయన్నారు. అందులో ఈ ఏడాది ముప్పై వేల కుటుంబాల జీవనస్థితిగతులను మార్చడానికి కార్యోన్ముఖులు కావాలని వారిలో స్పూర్తినింపారు. మహిళలను లక్షాధికారులను చేసేలా జ్ఞానోదయం చేయాలన్నారు. అందుబాటులో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుంటూ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి బాపట్ల జిల్లా వేదికగా మారాలన్నారు. పశు సంపద వృద్ధితోనే పాల ఉత్పత్తి పెరుగుతుందని, తద్వారా ఆదాయ వనరులు అధికమవుతాయన్నారు. ఇందుకు అవసరమయ్యే పశు దాణ ఉత్పత్తికి ప్రభుత్వ భూమి లీజ్ కు ఇస్తామని ఆయన ప్రకటించారు. నామమాత్రం అద్దెకు భూమి కేటాయిస్తామన్నారు. మహిళలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.