విజయవాడ, ఆగస్టు 6 :– రాష్ట్రంలో ఆయుష్ వైద్య సేవల విస్తరణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. 2026–27 ఆర్థిక సంవత్సరానికి జాతీయ ఆయుష్ మిషన్ కింద రూ.257 కోట్ల నిధులు మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు వెల్లడించారు. అలాగే ఆయుష్, ఫుడ్ సేఫ్టీ శాఖల్లో జీరో వేకెన్సీ విధానంలో ఖాళీల భర్తీకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో చర్చిస్తామని చెప్పారు.
విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రభుత్వ ఆయుర్వేద, హోమియోపతి, యునాని, సిద్ధ వైద్యుల రాష్ట్ర స్థాయి సదస్సు ముగింపు కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. గత ప్రభుత్వం జాతీయ ఆయుష్ కమిషన్ నుంచి నిధులు తీసుకురావడంలో విఫలమైందని విమర్శించిన ఆయన, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2024–25లో రూ.85 కోట్లు, 2025–26లో రూ.166 కోట్లు కేంద్రం నుంచి మంజూరయ్యాయని తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మరింత అధిక నిధులు వచ్చే అవకాశముందని ఆశాభావం వ్యక్తం చేశారు.
గుంటూరు సమీపంలో రూ.100 కోట్ల వ్యయంతో కేంద్ర యోగా, ప్రకృతి వైద్య పరిశోధన సంస్థ ఏర్పాటుకు 15 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిందని మంత్రి చెప్పారు. గత ప్రభుత్వం కేటాయించిన భూమిని ఇళ్ల స్థలాలకు మళ్లించడంతో ఆ ప్రాజెక్టు నిలిచిపోయిందని ఆరోపించారు.
రాష్ట్రంలో ఆయుష్ వైద్య మౌలిక సదుపాయాల విస్తరణలో భాగంగా ధర్మవరం, పిఠాపురంలో ఆయుర్వేద వైద్య కళాశాలలు, ప్రొద్దుటూరులో యునాని వైద్య కళాశాల ఏర్పాటుకు ఒక్కో కళాశాలకు రూ.70 కోట్ల చొప్పున మొత్తం రూ.210 కోట్లు వెచ్చిస్తున్నట్లు వెల్లడించారు. ఆయా ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణ పూర్తయిందన్నారు. అలాగే తిరుపతి, గిద్దలూరు, నందిగామ, తెనాలి, టెక్కలి, రంపచోడవరంలో ఒక్కోటి రూ.15 కోట్లతో సమగ్ర ఆయుష్ స్పెషాలిటీ ఆసుపత్రులను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. విశాఖపట్నంలో రూ.70 కోట్లతో నిర్మిస్తున్న నేచురోపతి వైద్య కళాశాల పనులు తుది దశకు చేరుకున్నాయని చెప్పారు.
ఆయుష్ ఆరోగ్య మందిరాలకు శాశ్వత భవనాల నిర్మాణ పనులు కూడా చివరి దశలో ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఇప్పటివరకు వివిధ హోదాల్లో 216 మంది ఆయుష్ వైద్యులను నియమించిందని వెల్లడించారు.
ఆయుర్వేదంలోని శల్యతంత్ర, శాకల్యతంత్ర విభాగాలకు సంబంధించిన 58 రకాల శస్త్రచికిత్సలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని మంత్రి తెలిపారు. అయితే సంబంధిత వైద్యులు, ప్రజలకు పూర్తి స్థాయి అవగాహన కల్పించిన తర్వాతే వాటిని అమల్లోకి తీసుకువస్తామని స్పష్టం చేశారు. ఆయుష్ వైద్యానికి ప్రాధాన్యం ఇవ్వడం అంటే అల్లోపతి వైద్యాన్ని పక్కన పెట్టడం కాదని, అత్యవసర చికిత్సలు, క్లిష్ట శస్త్రచికిత్సల్లో అల్లోపతి కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. యోగా, ప్రకృతి వైద్యం, సమతుల్య ఆహారం, ఆరోగ్యకర జీవనశైలితో అనేక వ్యాధులను నివారించవచ్చని సూచించారు.
సదస్సులో వైద్యారోగ్య శాఖ కార్యదర్శి జి. వీరపాండియన్, ఆయుష్ కమిషనర్ రోణంకి గోపాలకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలోని ఆయుష్ వైద్య కేంద్రాలను హెచ్ఎంఐఎస్ పోర్టల్‌తో అనుసంధానం చేసినట్లు తెలిపారు. ఇప్పటికే 60 వేల మంది రోగుల వివరాలను డిజిటల్ విధానంలో నమోదు చేశామని, రోగి నమోదు నుంచి మందుల పంపిణీ వరకు అన్ని సేవలను ఆన్లైన్లో నిర్వహించేలా వ్యవస్థను బలోపేతం చేశామని వెల్లడించారు. కొత్త ఆయుర్వేద కళాశాలలు, సమగ్ర ఆయుష్ ఆసుపత్రుల నిర్మాణాలను వేగంగా పూర్తి చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నట్లు తెలిపారు.
కేంద్ర ప్రభుత్వ హోమియోపతి సలహాదారు డాక్టర్ ప్రీతా కిజక్కుట్టిల్ హోమియో ఆసుపత్రుల్లో ఒకే విధమైన చికిత్సా ప్రమాణాలు పాటించాలని సూచించారు. ప్రభుత్వ యోగా, నేచురోపతి సలహాదారు మంతెన సత్యనారాయణ రాజు ప్రజల జీవనశైలిలో మార్పులు, ఆరోగ్య సంరక్షణలో యోగా, ప్రకృతి వైద్య ప్రాధాన్యంపై వివరించారు.
ఈ రాష్ట్ర స్థాయి సదస్సుకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 550 మంది ఆయుష్ వైద్యులు హాజరయ్యారు. రాష్ట్ర చరిత్రలో ఇంత పెద్ద స్థాయిలో ఆయుష్ వైద్యుల సదస్సు నిర్వహించడం ఇదే తొలిసారి కావడం విశేషం.
ఆయుష్ వైద్య సేవల అభివృద్ధికి రూ.257 కోట్ల ప్రతిపాదనలు– జీరో వేకెన్సీ కింద నియామకాలపై సీఎంతో చర్చిస్తా-మంత్రి సత్యకుమార్ యాదవ్



