బాపట్ల:-అభివృద్ధి దిశగా బాపట్ల పురపాలక సంఘం వేగంగా అడుగులు వేస్తోంది. పట్టణ మౌలిక వసతుల అభివృద్ధి పథకం (UIFD) కింద బాపట్లకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ₹29 కోట్ల నిధులు మంజూరైనట్లు స్థానిక శాసనసభ్యులు వేగేశన నరేంద్ర వర్మ రాజు వెల్లడించారు.
ఈ నెల 22వ తేదీన కుప్పంలో నిర్వహించే పబ్లిక్ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వర్చువల్ విధానం ద్వారా రాష్ట్రవ్యాప్త అభివృద్ధి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమానికి బాపట్ల పురపాలక సంఘ కార్యాలయం వేదిక కానుండగా, ఎమ్మెల్యే నరేంద్ర వర్మ నేరుగా పాల్గొంటారు.Bapatla Local news
ఒకే ఏడాదిలో ₹50 కోట్లకు పైగా నిధులు:
ఇటీవలే ‘అమృత్ 2.0’ పథకం కింద తాగునీటి సరఫరా, నీటి వనరుల పునరుద్ధరణ పనుల కోసం ₹22 కోట్లు మంజూరైన సంగతి తెలిసిందే. ఆ పనులు ఇప్పటికే శరవేగంగా జరుగుతున్నాయి. తాజాగా మంజూరైన మరో ₹29 కోట్లతో కలిపి, ఒక్క ఏడాదిలోనే బాపట్ల మున్సిపాలిటీకి ₹50 కోట్లకు పైగా నిధులు సమకూరడం విశేషం.
చేపట్టబోయే ముఖ్యమైన అభివృద్ధి పనులు:
- రహదారుల విస్తరణ & పునర్నిర్మాణం: పట్టణంలో పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా ప్రధాన రహదారుల అభివృద్ధి.
- ఆధునిక వీధి దీపాలు: పట్టణ పరిధిలో విస్తృతంగా కొత్త వీధి దీపాల ఏర్పాటు.
- పార్కుల అందాలతీర్చిదిద్దడం: స్థానికుల కోసం ఆహ్లాదకరమైన పార్కుల అభివృద్ధి.
- హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (HAM): మున్సిపాలిటీల్లో నాణ్యమైన రోడ్లు, మౌలిక సదుపాయాల కల్పనకు టెండర్ల ప్రక్రియ వేగవంతం.
“కూటమి ప్రభుత్వంతోనే ఇది సాధ్యం” – ఎమ్మెల్యే నరేంద్ర వర్మ
బాపట్ల చరిత్రలోనే ఇంత పెద్దమొత్తంలో ఒకే ఏడాదిలో నిధులు రావడం ఇదే తొలిసారి అని ఎమ్మెల్యే హర్షం వ్యక్తం చేశారు. బాపట్ల రూపురేఖలను మార్చే సమగ్ర ప్రణాళిక సిద్ధమైందని తెలిపారు. ఈ సందర్భంగా నిధుల మంజూరుకు సహకరించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రి నారా లోకేష్‌లకు ఎమ్మెల్యే ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.



