
ఏలూరు జిల్లాలో యువతలో నైపుణ్యాన్ని సృజనాత్మక శక్తిని వెలికి తీసేందుకు ఫిలిం ట్రైనింగ్ అకాడమీ ఏర్పాటు చేయనున్నట్లు హైదరాబాద్కు చెందిన లెటర్స్ ఫిలిమ్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ అకాడమీ చైర్మన్ దీపక్ బల్దేవ్ ఠాకూర్ అన్నారు. ఏలూరు నగరంలోని జిల్లా పరిషత్ అతిథిగృహంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దీపక్ బల్దేవ్ మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా హైదరాబాదులో అకాడమీ నడుపుతున్నామని ఎంతోమంది కళాకారులు సినీ పరిశ్రమలో నిలదొక్కుకున్నారన్నారు. సినీ నిర్మాత శంకర్ మాట్లాడుతూ తాను కొన్ని సినిమాలకు నిర్మాతగా వ్యవహరించానని అకాడమీ ఇన్స్టిట్యూట్లో శిక్షణ పొందిన కళాకారులకు అవకాశాలు కల్పించామన్నారు. మటన్ బాలు మాట్లాడుతూ ఏలూరు జిల్లాలో పార్లమెంట్ సభ్యులు పుట్టా మహేష్ కుమార్ యాదవ్ సహాయ సహకారాలతో త్వరలో ఇచట యువతీ యువకులకు వారిలోని కలా నైపుణ్యాన్ని వెలుగు తీసే విధంగా ఆడిషన్స్ నిర్వహించి అవసరమైన వారికి ప్రత్యేక శిక్షణ ఇస్తామన్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ఎంతోమంది నటీనటులు సినీ పరిశ్రమలో మెగాస్టార్లు రెబల్ స్టార్లు గా ఉన్నారని అదేవిధంగా జిల్లాలో యువతలో నైపుణ్యాన్ని సృజనాత్మక శక్తిని ఇచ్చే అత్యున్నత అకాడమీ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.








