GUNTUR NEWS: బనకచర్ల ప్రాజెక్టు ఆలోచన ఇకనైనా ఆపండి – ప్రొఫెసర్ కె. బయ్యపు రెడ్డి, ప్రముఖ పర్యావరణ వేత్త
ఆంధ్రప్రదేశ్ లో నిర్మాణంలో ఉన్న పలు నీటిపారుదల ప్రాజెక్టులను పూర్తి చేయకుండానే మరో భారీ ప్రాజెక్టును 82 వేల కోట్ల రూపాయలతో నిర్మించ తలపెట్టడం అర్థ రహితమని, కేంద్ర అటవీ పర్యావరణ నిపుణుల కమిటీ బనకచర్ల ప్రాజెక్టును తిరస్కరించి ఆ ప్రతిపాదనను వెనక్కి పంపిన తర్వాత నైనా రాష్ట్ర ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్టుకు స్వస్థి పలకాలని ప్రముఖ పర్యావరణ వేత్త ఆంధ్రప్రదేశ్ లో 18 నీటిపారుదల ప్రాజెక్టులకు, దేశవ్యాప్తంగా 40 నీటిపారుదల ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు తెప్పించిన ప్రొ|| కె. బయ్యపు రెడ్డి తెలిపారు. ఈనెల 1వ తేదీన గుంటూరులోని జనచైతన్య వేదిక హాలులో బనకచర్ల ప్రాజెక్టుపై జరిగిన మీడియా సమావేశంలో ప్రొఫెసర్ కె. బయ్యపు రెడ్డి ప్రధాన వక్తగా ప్రసంగించారు. ప్రాజెక్టు అవసరమా ? అని ప్రశ్నిస్తూ ఆర్థిక, సాంకేతిక, సామాజిక, పర్యావరణ పరమైన అంశాలను పరిగణన లోకి తీసుకోకుండా, నీటిపారుదల నిపుణులతో సంప్రదించకుండా హడావిడిగా ప్రతిపాదనలను రూపొందించి కేంద్రానికి పంపడం అవివేకమన్నారు. అప్పుల పాలైన రాష్ట్రంలో మరో 82 వేల కోట్లు ఒక్క భారీ ప్రాజెక్టు పై వెచ్చించడం, 48వేల ఎకరాల భూమిని సేకరించడం, అందులో 17 వేల ఎకరాల అటవీ భూమిని వినియోగించడం, 27 కిలోమీటర్ల మేర సొరంగ మార్గాన్ని త్రవ్వడం, 400 కిలోమీటర్ల పైప్ లైన్ల నిర్మించడం లాంటి పనులు పూర్తి చేయడానికి 50 సంవత్సరాలు పడుతుందని, నేటి 82 వేల కోట్ల అంచనా వ్యయం నాటికి 8 లక్షల కోట్లగా పైగా చేరిన ఆశ్చర్య పడనక్కర్లేదన్నారు. 2004 లో 8 వేల కోట్ల అంచనాతో 150 అడుగుల ఎత్తుతో పోలవరం ప్రాజెక్టు నిర్మించాలని భావిస్తే నేడు 57 వేల కోట్లకు చేరిందని, పోలవరం పూర్తయ్యే నాటికి 80 వేల కోట్లకు చేరుతుందని వివరించారు. పోలవరం ప్రాజెక్టు వద్ద గల 180 అడుగుల నుండి 880 అడుగుల ఎత్తులో ఉన్న బనకచర్లకు నీటిని 9 చోట్ల పంపింగ్ చేయడం వ్యయ ప్రయాసలతో కూడుకున్న పని అన్నారు. గత 40 సంవత్సరాలుగా నిర్మాణంలో ఉన్న నీటిపారుదల ప్రాజెక్టులలో పులిచింతల ప్రాజెక్టు మినహా ఏ ఒక్క నీటిపారుదల ప్రాజెక్టు పూర్తి కాకపోవడం దురదృష్టకరమన్నారు. బనకచర్ల ప్రాజెక్టు ప్రతిపాదన రాగానే తెలంగాణ ప్రభుత్వం గోదావరి నుండి 1000 టీ ఎం సి ల నీటిని కృష్ణా నది నుండి 500 టీఎంసీల నీటిని పొందాలని కుటిల ప్రయత్నం చేస్తుందన్నారు. పోలవరం నుండి రోజుకి రెండు టీఎంసీల చొప్పున 100 రోజుల్లో 200 టీఎంసీల నీటిని తరలించవచ్చునని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుందని, అయితే ఆచరణలో సగటున ఏడాదికి 30 రోజుల కన్నా వరద నీటి లభ్యత ఉండదన్నారు. బొల్లాపల్లి వద్ద 150 టీఎంసీ ల సామర్థ్యంతో రెండు కొండల మధ్య రిజర్వాయర్ నిర్మించాలని భావిస్తున్నారని, ఈ కొండల రాతి పొరల్లో పగుళ్ళు ఉంటే గనుక నిల్వచేసిన 150 టీఎంసీల నీరు లీకయ్యే ప్రమాదం లేక పోలేదన్నారు. రాజకీయ, ఆర్థిక లబ్ధి కోసం ఓవైపు రాజధాని పేరుతో రెండు, మూడు పంటలు పండే లక్ష ఎకరాల భూమిని సమీకరించడం, మరోవైపు కరేడు, ఉలవపాడు ప్రాంతాలలో అత్యున్నతమైన మామిడి పండ్లు పండే 8 వేల ఎకరాల సారవంతమైన భూమిని సోలార్ విద్యుత్ కోసం రాష్ట్ర ప్రభుత్వం సేకరించ తలపెట్టడం ప్రమాదకరమన్నారు. జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ప్రసంగిస్తూ ఏడాది కూటమి పాలనలో 1,60 వేల కోట్లకు పైగా అప్పులు చేయడం, భూ దాహంతో సారవంతమైన భూములను విధ్వంసం చేయడంతో పాటు నేడు 82 వేల కోట్లతో మరో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించ తలపెట్టడం దుర్మార్గమన్నారు. 25 వేల కోట్ల రూపాయలతో నిర్మాణంలో ఉన్న నీటిపారుదల ప్రాజెక్టులు అన్నింటిని పూర్తిచేసే అవకాశం ఉందని వివరించారు. పోలవరం ప్రాజెక్టును 45.72 మీటర్ల నుండి 41.15 మీటర్లకు తగ్గించడం ద్వారా పోలవరం ప్రాజెక్ట్ ఒక బ్యారేజ్ గా మారే ప్రమాదం ఉందని తెలిపారు. ఇండో సోల్ కంపెనీకి, షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ లకు గత ప్రభుత్వం లబ్ధి చేకూరిస్తే, నేటి ప్రభుత్వం కూడా అదే త్రోవలో పయనిస్తుందని, సూర్యరశ్మి అపారంగా ఉండే బీడు, చౌడు భూములు, పంటలకు యోగ్యం కాని భూములు లక్షలాది ఎకరాల అందుబాటులో ఉండగా, సారవంతమైన పంట భూములను వేలాది ఎకరాలు సేకరించి ఇండోసోల్ సంస్థకు అప్పగించే ప్రయత్నాన్ని విరమించుకోవాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ కు బనకచర్ల ప్రాజెక్టు గుదిబండగా మారుతుందని కేంద్ర అటవీ పర్యావరణ నిపుణుల కమిటీ సూచన మేరకు బనకచర్ల ప్రాజెక్టు ప్రతిపాదన విరమించుకోవాలని కోరారు. మీడియా సమావేశంలో ప్రముఖ విద్యావేత్త ప్రొఫెసర్ డి. ఏ. ఆర్. సుబ్రహ్మణ్యం, సామాజిక విశ్లేషకులు టి. ధనుంజయ రెడ్డి తదితరులు పాల్గొని ప్రసంగించారు.