
బాపట్ల : 02-11-25:-మొంథా తుఫాను బీభత్సం మధ్య ప్రజల రక్షణ కోసం అధికారులు ప్రదర్శించిన అపార సమర్థతను బాపట్ల శాసనసభ్యులు వేగేశన నరేంద్ర వర్మ రాజు కొనియాడారు. తుఫాను ప్రభావం తీవ్రంగా ఉన్నప్పటికీ, ఎక్కడా ప్రాణ నష్టం జరగకుండా జిల్లాలోని అధికార యంత్రాంగం సమయస్ఫూర్తిగా స్పందించిందని ఆయన ప్రశంసించారు.జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్, ఎస్పీ ఉమామహేశ్వర్ నేతృత్వంలో అధికారులు రాత్రింబవళ్లు కష్టపడి పనిచేసి ప్రజల ప్రాణాలను కాపాడారని ఎమ్మెల్యే అభినందించారు. తుఫాను బీభత్సం మధ్య కలెక్టర్ స్వయంగా పర్యవేక్షణ చేసి బాధితులను ఆదుకున్న తీరు జిల్లా యంత్రాంగం సమర్థతకు నిలువుటద్దంగా నిలిచిందని తెలిపారు.ప్రకృతి కన్నెర్ర చేస్తే ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యే తీరప్రాంత ప్రజలకు అధికారులు ఇచ్చిన భరోసా వల్లే పెద్ద నష్టం తప్పిందని చెప్పారు. ఈ క్రమంలో బాపట్ల ప్రాంతంలోని తెలుగుదేశం, జనసేన, బిజెపి పార్టీల నాయకులు, కార్యకర్తలు ప్రజలకు సేవలందించడంలో ఒకే వేదికగా పనిచేశారని ఎమ్మెల్యే తెలిపారు.
ఇంత భారీగా తుఫాను బీభత్సం జరిగినా ప్రాణ నష్టం జరగకుండా నియంత్రించడంలో జిల్లా అధికారులు చూపిన సమర్థతను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రశంసించేలా ఉందని అన్నారు.తుఫానుతో నష్టపోయిన రైతులు, ప్రజలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని ఎమ్మెల్యే తెలిపారు. ఇప్పటికే వేలాది మంది పునరావాస కేంద్రాల్లో ఉన్న బాధితులకు నిత్యావసర సరుకులు, ఆర్థిక సాయం అందజేస్తున్నామని చెప్పారు. పంట పొలాలు, ఉద్యాన పంటలు దెబ్బతిన్న రైతులకు ప్రభుత్వం తగిన పరిహారం అందజేస్తుందని పేర్కొన్నారు.“ఏ ఒక్క రైతు కూడా ఇబ్బంది పడకూడదన్నది కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యం” అని ఎమ్మెల్యే నరేంద్ర వర్మ రాజు స్పష్టం చేశారు.మొంథా తుఫాను ప్రభావాన్ని ముందుగానే అంచనా వేసి, అత్యంత ముందుచూపుతో వ్యవహరించిన జిల్లా అధికార యంత్రాంగం మొత్తం ప్రశంసనీయం అని అన్నారు.అంతేకాకుండా, తుఫాను సమయంలో అహర్నిశలు శ్రమించి సేవలందించిన రెవెన్యూ, పోలీసు, మెరైన్, ఇరిగేషన్, పంచాయతీరాజ్, వైద్య ఆరోగ్య శాఖల సిబ్బంది, పునరావాస కేంద్రాల సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, రెడ్ క్రాస్ కార్యకర్తలు, మహిళా సంఘాల నిర్వాహకులు, పాత్రికేయులు, స్వచ్ఛంద సేవా సంస్థలు తదితరులందరికీ ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.“ఆపదలోనూ ప్రజలతో కలిసి నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు… బాపట్ల జిల్లా నిలకడగా ఉండటం అందరి కలసికట్టైన కృషి ఫలితం” – ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు.







