
గుంటూరు, నవంబర్ 8:-గుంటూరు నగరంలోని ప్రధాన రహదారులపై ట్రాఫిక్‌కు ఆటంకంగా మారుతున్న ఆవులు, ఎద్దులు, దూడలపై నగరపాలక సంస్థ కఠిన నిర్ణయం తీసుకుంది. ఈనెల 10వ తేదీ (సోమవారం) నుండి రోడ్లపై సంచరిస్తున్న పశువులను వెంగళాయపాలెంలోని జిఎంసి బందెలదొడ్డికి తరలించనున్నట్టు కమిషనర్ పులి శ్రీనివాసులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.కమిషనర్ మాట్లాడుతూ నగరంలోని ప్రధాన రహదారులపై పశువులు విచ్చలవిడిగా తిరుగుతుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కొన్ని సందర్భాల్లో ప్రమాదాలు కూడా చోటు చేసుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే పలు మార్లు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ, పశువుల యజమానులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన తెలిపారు.
సోషల్ మీడియా మరియు ఇతర వేదికల ద్వారా పశువుల వలన ఎదురయ్యే సమస్యలపై అనేక ఫిర్యాదులు అందుతున్నాయని కమిషనర్ పేర్కొన్నారు. ప్రజా ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకొని, రోడ్లపై కనిపించే ఆవులు, ఎద్దులు, దూడలను బందెలదొడ్డికి తరలించాలని ప్రజారోగ్య అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్టు వెల్లడించారు
.బందెలదొడ్డికి తరలించిన పశువులను విడుదల చేయబోమని, అలాగే భారీ అపరాధ రుసుము వసూలు చేయబడుతుందని కమిషనర్ హెచ్చరించారు. రోడ్లపై పశువులు సంచరిస్తే వాటి యజమానులపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.ప్రజలు ఎవరైనా రోడ్లపై పశువుల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటే, వెంటనే జిఎంసి కాల్‌సెంటర్ 08632-345103కు ఫిర్యాదు చేయాలని కమిషనర్ పులి శ్రీనివాసులు విజ్ఞప్తి చేశారు.







