
చింతలపూడి, మార్చి 8: చింతలపూడి విద్యుత్ శాఖలో అక్రమాల పుట్ట కదులుతోంది. నిబంధనలకు పాతర వేస్తూ, సామాన్యుడి నుంచి సంపన్నుడి వరకు ప్రతి ఒక్కరినీ టార్గెట్ చేస్తూ సాగుతున్న ఈ ‘వసూళ్ల పర్వం’ ఇప్పుడు పట్టణంలో హాట్ టాపిక్ గా మారింది. సదరు విభాగంలో తవ్వేకొద్దీ అవినీతి తిమింగలాలు బయటపడుతున్నాయి.
లక్షల్లో వసూళ్లు.. వేలల్లో లెక్కలు!
పట్టణంలోని ఒక ప్రముఖ వ్యక్తికి ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేసి, సర్వీస్ కనెక్షన్ ఇచ్చే క్రమంలో ఒక అధికారి తన ప్రతాపం చూపినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం విద్యుత్ శాఖకు చెల్లించాల్సిన ఫీజు కేవలం ₹30,000 లోపే ఉన్నప్పటికీ, సదరు ఉద్యోగి ఏకంగా ₹2.50 లక్షల పైనే వసూలు చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అంటే మిగిలిన సొమ్ము ఎవరి జేబుల్లోకి వెళ్ళిందో అర్థం చేసుకోవచ్చు.
మీటర్ మార్చాలన్నా.. ‘ముడుపు’ చెల్లించాల్సిందే!
కేవలం భారీ కనెక్షన్లే కాదు, సామాన్యులు వాడే గృహ విద్యుత్ మీటర్ల విషయంలోనూ దోపిడీ ఆగడం లేదు.
- కాలిపోయిన మీటర్లు: ఒకవేళ మీటర్ కాలిపోతే, దానిని మార్చడానికి వినియోగదారుల నుంచి ₹2,000 నుండి ₹3,000 వరకు ముక్కుపిండి వసూలు చేస్తున్నారు.
- ప్రభుత్వ ఖజానాకు గండి: ఈ వసూలు చేసిన మొత్తాన్ని అధికారికంగా సంస్థకు జమ చేయకుండా, సొంత లాభం కోసం వాడుకుంటూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.Eluru Local News
కీలక అధికారి అండదండలు?
నియమ నిబంధనలను బేఖాతరు చేస్తూ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న ఈ ఉద్యోగికి శాఖలోని ఒక కీలక అధికారి పూర్తి స్థాయిలో సహకరిస్తున్నట్లు సమాచారం. ఆ అధికారి అండ చూసుకునే సదరు వ్యక్తి చింతలపూడిలో ‘రాజ్యం’ ఏలుతున్నాడని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
” ఉన్నతాధికారులు వెంటనే స్పందించి సమగ్ర విచారణ జరపాలి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, ఇలాంటి అక్రమ వసూళ్లకు అడ్డుకట్ట వేయాలి.







