
విజయవాడ: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి న్యూస్ ఛానల్ ఏపీ బ్యూరో రిపోర్టర్ కేసంనేని పూర్ణచంద్రరావు (ఏబీఎన్ పూర్ణ) ఆకస్మిక మరణం పట్ల వేమూరు శాసనసభ్యులు శ్రీ నక్కా ఆనంద బాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విజయవాడలోని పూర్ణ నివాసానికి వెళ్లిన ఎమ్మెల్యే, ఆయన పార్థివ దేహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పూర్ణ కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నిబద్ధత గల జర్నలిస్టుగా పేరు తెచ్చుకున్న పూర్ణ గారు, కేవలం 54 ఏళ్ల చిన్న వయసులోనే అనారోగ్యంతో కన్నుమూయడం అత్యంత బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన త్వరగా కోలుకుంటారని ఆశించానని, కానీ ఈ విషాద వార్త తనను కలచివేసిందని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల కవరేజ్ సమయంలో పూర్ణ గారితో తనకు సన్నిహిత పరిచయం ఏర్పడిందని, ప్రజా సమస్యలపై నిర్మొహమాటంగా, నిజాయితీగా స్పందించే వ్యక్తిత్వం ఆయన ప్రత్యేకత అని కొనియాడారు.

మంచిని ప్రోత్సహిస్తూ, తప్పులను నిర్భయంగా ఎత్తిచూపే ధైర్యం గల పూర్ణ మృతి మీడియా రంగానికి తీరని లోటని ఎమ్మెల్యే అభిప్రాయపడ్డారు. అందరితో కలివిడిగా ఉంటూ ఎంతోమంది మిత్రులను సంపాదించుకున్న ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు.http://NTR DISTRICT NEWS







