

ప్రజా ప్రయోజనం కొరకు అద్దంకి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు.
అద్దంకి పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి పొంగూరు నారాయణ, జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, కలిసి సోమవారం ప్రారంభించారు. మంత్రులు పలు ప్రాంతాలలో విస్తృతంగా పర్యటించారు. తొలుత అద్దంకి పట్టణం ద్వారకా నగర్ లో రూ.4.60 కోట్లతో నిర్మించిన 33/11 కెవి విద్యుత్ ఉప కేంద్రాన్ని మంత్రులు, కలెక్టర్ కలిసి ప్రారంభించారు. శిలాఫలకాన్ని ఆవిష్కరించిన అనంతరం మొక్కలు నాటారు.
అద్దంకి పట్టణంలో రూ.7.25 కోట్లతో సిసి రహదారులు, సైడ్ కాల్వల నిర్మాణ పనులకు విద్యుత్, పట్టణ పురపాలక శాఖ మంత్రులు కలిసి శంకుస్థాపన చేశారు. తదుపరి పసుమర్తిపాలెంలో రూ.15 లక్షల నిధులతో నిర్మించిన సామాజిక భవనాన్ని, శ్రీ ప్రకాశం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థుల కొరకు రూ.25 లక్షలతో నిర్మించిన డైనింగ్ హాల్ ను ప్రారంభించారు. అసిస్ట్, ఎన్ఆర్ఈ డిసిఏపి సంస్థల సహకారంతో 230 సైకిళ్లను విద్యార్థుని విద్యార్థులకు మంత్రులు ఉచితంగా పంపిణీ చేశారు. అనంతరం 60 మంది నిరుపేదలకు ఇంటి నివాస స్థలాల పట్టాలను మున్సిపల్ కార్యాలయంలో అందజేశారు. మెప్మా ఆధ్వర్యంలో ఎల్ హెచ్ పి సెల్ కింద రూ.50 లక్షల నిధులను 60 డ్వాక్రా సంఘాలకు మంత్రులు కలిసి పంపిణీ చేశారు.
కూటమి ప్రభుత్వ పాలనలో శరవేగంగా అభివృద్ధి జరుగుతోందని మంత్రి రవికుమార్ చెప్పారు. అద్దంకి నియోజకవర్గం అన్ని రంగాలలో అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నామన్నారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీల కాలనీలలో రహదారులు, కాల్వల నిర్మాణానికి రూ.3.5 కోట్లతో పనులు ప్రారంభించామన్నారు. అద్దంకి పట్టణానికి ట్రాఫిక్ సమస్య లేకుండా నూతన బైపాస్ ఏర్పాటుకు రూ.18 కోట్లతో రూపొందించిన ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపామన్నారు. అలాగే చెరువు కట్ట అభివృద్ధికి నిధులు కేటాయించాలని పట్టణ అభివృద్ధి శాఖ మంత్రిని కోరారు. చెరువు కట్టపై నివాసం ఉంటున్న వారందరికీ ఇంటి నివాస స్థలాలు పంపిణీ చేస్తున్నామని, వారి ఇళ్ల నిర్మాణానికి ఒక్కొక్కరికి రూ.2.50 లక్షల నిధులు ఇస్తామన్నారు. వారికి ఇచ్చిన కేటాయించిన ప్రాంతంలో నివాసయోగ్యంగా రహదారులు, విద్యుత్, తాగునీరు, కాల్వలు వంటి అన్ని సదుపాయాలు త్వరలోనే ఏర్పాటు చేస్తామన్నారు. టిడ్కో గృహాలు 90% పూర్తికాగా, పెండింగ్ లో ఉన్న రూ.50 కోట్లతో పూర్తి చేయించి త్వరలోనే గృహ ప్రవేశాలు చేపిస్తామన్నారు. పర్యావరణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవలసిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. పట్టణంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. కొన్ని పనులకు శంకుస్థాపన చేయగా, మరి కొన్ని పనులు పూర్తిచేసి ప్రారంభించామన్నారు. అద్దంకి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండి, అన్ని సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన టిడ్కో గృహాలను రానున్న ఏడాది జూన్ లో పూర్తిచేసి ప్రారంభిస్తామని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి పొంగూరు నారాయణ చెప్పారు. పేద ప్రజలందరి కలలు సహకారం చేస్తామన్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందన్నారు. ప్రభుత్వ ఖజానా ఖాళీగా ఉండడంతో ఆర్థిక సమస్యలు తలెత్తాయని, రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ నారా చంద్రబాబు నాయుడు తన అనుభవ జ్ఞానంతో సమర్థంగా అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నారని వివరించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను సమర్ధంగా అమలు చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో చెత్త కుప్పలు 85 లక్షల టన్నులు ఇప్పటికే తొలగించామని, త్వరలో అన్నిటిని తొలగించి పర్యావరణ పరిరక్షించడానికి చర్యలు తీసుకుంటామన్నారు. పట్టణ అభివృద్ధిలో ప్రజలంతా భాగస్వాములు కావాలన్నారు. అద్దంకి పట్టణంలో తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి అమృత్ పథకం కింద రూ.110 కోట్ల నిధులు మంజూరు చేస్తామన్నారు. ప్రతి ఇంటికి కొళాయి కనెక్షన్లు ఇచ్చి సురక్షిత తాగునీటిని సరఫరా చేస్తామన్నారు. ఈ పనులు త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. రూ.6 కోట్ల నిధులతో అద్దంకి పట్టణ చెరువు అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. బైపాస్ ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనను పరిశీలించి త్వరలోనే చర్యలు తీసుకుంటామన్నారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీవో చంద్రశేఖర్, విద్యుత్ శాఖ ఎస్ఈ ఆంజనేయులు, మెప్మా పీడీ సత్య ఆనంద్ పాల్, అద్దంకి మున్సిపల్ కమిషనర్, తహసిల్దార్, తదితరులు పాల్గొన్నారు.








