
అమరావతి: డిసెంబర్ 22:-రాష్ట్రంలో మద్యం విధానాన్ని వ్యాపారంలా కాకుండా, ఆరోగ్యకరమైన వృద్ధిని సాధించే దిశగా అమలు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఆదాయమే లక్ష్యంగా విధానాలు రూపొందించకూడదని స్పష్టం చేశారు. సచివాలయంలో సోమవారం ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖపై నిర్వహించిన సమీక్షలో సీఎం కీలక సూచనలు చేశారు.
లాటరీ విధానంలో షాపుల కేటాయింపు, అప్లికేషన్ ఫీజు, రిటైలర్ మార్జిన్ పెంపు, లిక్కర్ ఐడెంటిఫికేషన్ నెంబర్ (LIN) అమలు వంటి అంశాలపై మరింత పునఃపరిశీలన చేయాలని సూచించారు. బార్ ఏఆర్‌ఈటీ మినహాయింపు అంశాన్ని కూడా పరిశీలించాలని అధికారులను ఆదేశించారు.
అక్రమ మద్యం అరికట్టడం, బెల్టు షాపుల నియంత్రణ, డిజిటలైజేషన్, పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. బెల్టు షాపుల కట్టడికి హర్యానా మోడల్‌ను అధ్యయనం చేయాలని సూచించారు.Nandha Jyothi
అక్టోబర్ 2024 నుంచి అక్టోబర్ 2025 వరకు రూ.8,000 కోట్ల ఎక్సైజ్ ఆదాయం లక్ష్యంగా పెట్టుకోగా, రూ.7,041 కోట్ల ఆదాయం వచ్చినట్టు అధికారులు సీఎంకు వివరించారు. 2025–26 ఆర్థిక సంవత్సరంలో మద్యం విక్రయాల్లో 4.52 శాతం వృద్ధి నమోదైందని తెలిపారు. ఐఎంఎఫ్ఎల్ విక్రయాలు 19.08 శాతం, బీర్ విక్రయాలు 94.93 శాతం పెరిగాయని వెల్లడించారు.
మద్యం విక్రయాల్లో డిజిటల్ చెల్లింపులు 34.9 శాతం పెరిగాయని, నగదు వినియోగాన్ని తగ్గించి డిజిటల్ లావాదేవీలు పెంచాలని సీఎం సూచించారు. ప్రతి మద్యం బాటిల్‌కు ప్రత్యేక లిక్కర్ ఐడెంటిఫికేషన్ నెంబర్‌ను త్వరితగతిన అమలు చేయాలని, జియో-ట్యాగింగ్‌తో సరఫరా వ్యవస్థలో పూర్తి పారదర్శకత తీసుకురావాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో మంత్రులు కొల్లు రవీంద్ర, కొండపల్లి శ్రీనివాస్, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పీయూష్‌కుమార్, ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ శ్రీధర్, ఈడీ రాహుల్ దేవ్ శర్మ తదితరులు పాల్గొన్నారు.







