
మంగళగిరి: డిసెంబర్ 3- 2025 :- ఏఐఐఎంఎస్ మంగళగిరిలో డిసెంబర్ 2న వికలాంగుల అంతర్జాతీయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఫిజికల్ మెడిసిన్ అండ్ రిహాబిలిటేషన్ (పీఎమ్‌ఆర్) విభాగం ఆధ్వర్యంలో, సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రొఫ్. (డా.) అహంతేమ్ సాంటా సింగ్ మార్గదర్శకత్వంలో నిర్వహించారు.ఈ ఏడాది అంతర్జాతీయ థీమ్ “సామాజిక ప్రగతికి వికలాంగులకు అనుకూల సమాజాల నిర్మాణం” నేపథ్యంలో కార్యక్రమాన్ని చేపట్టినట్లు అధికారులు తెలిపారు. వికలాంగులపై అవగాహన పెంపు, సమగ్రత బలోపేతం, అలాగే రిహాబిలిటేషన్ రంగంలో బహుశాఖల సహకారాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ వేడుకలు నిర్వహించారు.
కార్యక్రమంలో భాగంగా జరిగిన పోస్టర్ పోటీలో విద్యార్థులు, సిబ్బందిల నుండి మొత్తం 51 ఎంట్రీలు రావడం విశేషం. వికలాంగుల అనుకూలతపై తమ సృజనాత్మక ఆలోచనలను పాల్గొన్నవారు పోస్టర్ల రూపంలో ప్రదర్శించారు. అలాగే లోకోమోటర్ డిసబిలిటీ, విజువల్ ఇంపైర్మెంట్, హియరింగ్ ఇంపైర్మెంట్ మరియు ఇంటెల్లెక్చువల్ డిసబిలిటీలపై అంతరశాఖ అవగాహన సెషన్ నిర్వహించారు. పీఎమ్‌ఆర్, ఆర్థోపెడిక్స్, ఈఎన్‍టీ, ఆప్టల్మాలజీ, సైకియాట్రి విభాగాల నిపుణులు ఇందులో పాల్గొని విద్యార్థులకు, సిబ్బందికి మార్గనిర్దేశం చేశారు.కార్యక్రమానికి అకాడెమిక్స్ డీన్, ఎగ్జామినేషన్ డీన్, డిప్యూటీ డైరెక్టర్ (అడ్మినిస్ట్రేషన్), నర్సింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ అధ్యక్షత వహించారు.వికలాంగుల సాధికారత, యాక్సెసిబిలిటీ మెరుగుదల, సమగ్రమైన వాతావరణ సృష్టికి తమ కట్టుబాటును ఏఐఐఎంఎస్ మంగళగిరి మరోసారి పునరుద్ఘాటించింది.








