
అమరావతి, అక్టోబర్ 13:-అఖిల భారత పోలీస్ పవర్ లిఫ్టింగ్ క్లస్టర్ పోటీలను రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా సోమవారం నాడు ఏపీఎస్పీ 6వ బెటాలియన్‌లో ఘనంగా ప్రారంభించారు. ఈ పోటీలు ఐదు రోజుల పాటు రెండు విభిన్న ప్రాంతాల్లో జరగనున్నట్లు హోంమంత్రి తెలిపారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, “పోలీసుల్లో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు పోటీలు ఎంతో కీలకం. గత ఏడాది ఈ పోటీలు ప్రారంభించాం. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యాక తొలిసారిగా ఇలాంటి పోటీలు జరగడం శుభ పరిణామం,” అని పేర్కొన్నారు.
పవర్ లిఫ్టింగ్‌తో పాటు యోగా పోటీలను కూడా నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని మంత్రి అనిత అన్నారు. “యోగాలో మన రాష్ట్రం ఇప్పటికే గిన్నిస్ బుక్‌లో స్థానం సంపాదించిందన్న విషయం గర్వించదగ్గది,” అని ఆమె పేర్కొన్నారు.రాజధాని అమరావతిలో స్పోర్ట్స్ సిటీ ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించిన మంత్రి అనిత, క్రీడల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పూర్తి ప్రాధాన్యం ఇస్తోందని స్పష్టం చేశారు.ఈ పోటీల్లో దేశం నలుమూలల నుంచి వచ్చిన మొత్తం 1011 మంది క్రీడాకారులు పాల్గొననున్నారని ఆమె తెలిపారు.







