
Bapatla :-ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక అక్షర ఆంధ్ర–ఉల్లాస్ కార్యక్రమాన్ని లక్ష్యానికి అనుగుణంగా విజయవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్‌కుమార్.వి అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంపై ఎంపీడీవోలు, ఎంఈఓలతో శనివారం స్థానిక కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాల మేరకు మార్చి నాటికి 51,786 మంది వయోజనులకు అక్షరాభ్యాసం కల్పించాల్సి ఉందని తెలిపారు. ఆ దిశగా సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని, శిక్షణ కార్యక్రమాల నిర్వహణకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన యాప్‌లో వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేయాలని స్పష్టం చేశారు.
జిల్లాలో విద్యార్థుల బయోమెట్రిక్ నవీకరణ 7,651 పెండింగ్‌లో ఉందని, వాటిని తక్షణమే పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే విద్యార్థుల ఈ-కేవైసీ పూర్తి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
తల్లికి వందనం పథకం కింద 650 మందికి సాంకేతిక సమస్యల కారణంగా నగదు అందలేదని, ఆయా సమస్యలను వెంటనే పరిష్కరించాలని సూచించారు.
జిల్లాలో 685 మంది డ్రాప్‌అవుట్ విద్యార్థులు ఉన్నట్లు గుర్తించామని, వారి ఇళ్లకు వెళ్లి పాఠశాలలకు ఎందుకు వెళ్లడం లేదో విచారణ చేసి తిరిగి విద్యలో చేర్చే చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. ఈ విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం సహించబోమని హెచ్చరించారు.
అదేవిధంగా, ఎంపిక చేసిన కుటుంబాల సామాజిక–ఆర్థిక సర్వేను వేగంగా పూర్తి చేయాలని చెప్పారు. సచివాలయాల సిబ్బంది ఆన్‌లైన్ హాజరు కచ్చితంగా ఉండాలన్నారు. వివిధ రకాల పన్నుల రూపంలో వచ్చిన నగదును ప్రభుత్వ ఖజానాకు సమయానుకూలంగా జమ చేయాలని ఆదేశించారు.
సచివాలయాల సిబ్బంది డిప్యూటేషన్‌లపై కలెక్టర్ కీలక సూచనలు చేశారు. కలెక్టర్ అనుమతి ఉన్న డిప్యూటేషన్‌లను మాత్రమే కొనసాగిస్తామని, మిగిలినవన్నీ రద్దు చేసి తమ విధుల్లోనే పనిచేయాలని ఆదేశించారు. సచివాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేస్తామని, ఆ సమయంలో గైర్హాజరైతే తక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు.Bapatla Local News
ఈ సమావేశంలో వయోజన విద్య జిల్లా నోడల్ అధికారి మధుసూదన్ రావు, డీఎల్‌డీవో విజయలక్ష్మి, కలెక్టరేట్ ఏవో మల్లికార్జునరావు తదితర అధికారులు పాల్గొన్నారు.










