అమరావతి, సెప్టెంబర్ 23:రాష్ట్ర రాజధాని అమరావతిలో రీజనల్ ఆఫీసులను ఏర్పాటు చేయాలని, అలాగే అక్కడ చేపట్టే ప్రాజెక్టుల్లో భాగస్వాములవ్వాలని బ్యాంకింగ్ రంగ ప్రముఖులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరారు.
విజయవాడలో జరిగిన లోక్‌సభ సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ సమావేశం సందర్భంగా నగరాన్ని సందర్శించిన పలు బ్యాంకుల చైర్మన్లు, ఎండీలకు సీఎం మంగళవారం క్యాంపు కార్యాలయంలో హైటీ విందు ఇచ్చారు. ఈ సందర్భంగా సీఎం రాష్ట్ర అభివృద్ధిపై, అమరావతి నిర్మాణంపై వారికి సమగ్ర అవగాహన కల్పించారు.
“అమరావతిని అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దుతున్నాం. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఇక్కడ తమ కార్యాలయాలను ఏర్పాటు చేస్తే భవిష్యత్తులో విస్తృత అవకాశాలు లభిస్తాయి” అని సీఎం తెలిపారు. ఇప్పటికే కొన్ని బ్యాంకులకు రాజధానిలో స్థలాలు కేటాయించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
రాష్ట్రంలో ప్రస్తుతం అమలు చేస్తున్న ప్రాజెక్టులు — పోర్టులు, ఎయిర్‌పోర్టులు, హార్బర్లు, జాతీయ రహదారులు, క్వాంటం వ్యాలీ వంటి వాటిపై ప్రస్తావించారు. విద్యుత్, వ్యవసాయం, సాగునీరు, విద్య, వైద్యం, పౌర సేవల రంగాల్లో టెక్నాలజీ వినియోగంపై కూడా ముఖ్యమంత్రి వివరించారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు పయ్యావుల కేశవ్, పి. నారాయణ, ఎంపీ బాలశౌరి, ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ రంగాల నుంచి ప్రముఖులు ఈ సమావేశానికి హాజరయ్యారు.
వారిలో ముఖ్యులు:
- ఎస్‌బీఐ చైర్మన్ శ్రీనివాసులు శెట్టి
- యూనియన్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ రామ సుబ్రమణ్యన్
- బ్యాంక్ ఆఫ్ బరోడా ఎండీ దేవదత్త చంద్
- పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎండీ అశోక్ చంద్ర
- ఇండియన్ బ్యాంక్ ఎండీ బినోద్ కుమార్
- బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎండీ రజనీష్ కర్నాటక్
- కెనరా బ్యాంక్ ఎండీ సత్యనారాయణ రాజు
- పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ సీఎండీ పరమేందర్ చోప్రా
- ఐఆర్‌డీఏఐ చైర్‌పర్సన్ అజయ్ సేత్
- ఎల్ఐసీ ఎండీ సత్పాల్ భాను
- ఇతర ఇన్సూరెన్స్ సంస్థల ప్రతినిధులు కూడా హాజరయ్యారు.
ఈ భేటీ ద్వారా రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన పెట్టుబడులు, సహకారం మరింత బలపడే అవకాశం ఉందని అధికార వర్గాలు ఆశాభావం వ్యక్తం చేశాయి.