అమరావతి, సెప్టెంబర్ 20: రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత జోక్యం వల్ల ఎంజేపీ గురుకుల విద్యాసంస్థల్లో ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న పదోన్నతుల ప్రక్రియకు కదలిక వచ్చింది. గత కొన్నేళ్లుగా నిలిచిపోయిన పదోన్నతుల పైల్కు జవులు వచ్చాయి. మొత్తం 30 మంది బోధన సిబ్బందికి పదోన్నతులు మంజూరు చేస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ మేరకు 16 మంది ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లకు (TGT) పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్లుగా (PGT) ప్రమోషన్లు ఇవ్వగా, 14 మంది పీజీటీలకు ప్రిన్సిపాల్ పదవులు లభించాయి. పదోన్నతుల ప్రక్రియలో ఆలస్యం కారణంగా నిరుత్సాహంగా ఉన్న ఉద్యోగులకు ఇది పండగలాంటిదిగా మారింది.
ఈ మేరకు ఉన్నతాధికారులు మంత్రి సవితకు పదోన్నతుల అంశాన్ని తీసుకెళ్లగా, తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆమె ఆదేశాలు జారీ చేశారు. వెంటనే సంబంధిత ఫైళ్లు కదలికకు వచ్చి, ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వెలువడాయి.
ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఈ పదోన్నతులు తమకు లభించడంతో ఉద్యోగులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. మంత్రి సవిత గారికి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుగారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.