
అమరావతి: రాయపూడి:12-10-2025:రాజధాని అమరావతిలో అభివృద్ధి శంఖారవం మోగించింది. సోమవారం ఉదయం 9:54 గంటలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో తొలి పాలనా భవనాన్ని అధికారికంగా ప్రారంభించనున్నారు. రాయపూడిలో నిర్మించిన ఈ భవనం ద్వారా నగరాభివృద్ధి మరియు పౌర పరిపాలన శాఖల కార్యాలయాలు ఇకపై అమరావతిలో నుంచే నిర్వహించబడనున్నాయి.
అన్ని హెచ్‌వో డీలూ ఒకేచోట – ప్రజలకు అందుబాటులో పాలనా ముద్ర
ఈ జీ+7 అంతస్తుల ప్రధాన భవనం 4.32 ఎకరాల విస్తీర్ణంలో 3,07,326 చ.అడుగుల బిల్టప్ ఏరియాతో నిర్మించబడింది. ఇందులో గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఏడో అంతస్తు వరకు విభిన్న శాఖల కార్యాలయాలు ఏర్పాటు చేయబడ్డాయి. ముఖ్యమంత్రి కార్యాలయం, మునిసిపల్ శాఖ డైరెక్టర్ కార్యాలయం, CRDA, ADCL వంటి ప్రధాన విభాగాలు ఇందులో ఉండనున్నాయి.
భవనం ముందు ప్రత్యేకంగా రూపొందించిన “A” అక్షర ఎలివేషన్ అమరావతిని ప్రతిబింబించేలా ఉంటుంది. టెర్రస్ పై డైనింగ్ స్పేస్ తో పాటు, మొత్తం 7 లిఫ్ట్‌లు, 170 ఫోర్ వీలర్‌లు, 170 టూ వీలర్‌లకు పార్కింగ్ వసతి కల్పించారు.
PEB భవనాలతో మున్సిపల్ శాఖకు విస్తృత స్థలం
ప్రధాన భవనానికి ఆనుకుని మరో 8 ఎకరాల్లో నిర్మించిన నాలుగు PEB భవనాల్లో పలు హెచ్‌వో డీలకు కార్యాలయాలు కేటాయించారు. ప్రతి భవనం 41,500 చ.అడుగుల విస్తీర్ణంలో ఉండగా, టిడ్కో, రెరా, స్వచ్చాంధ్ర కార్పొరేషన్, మెప్మా వంటి శాఖలు ఇక్కడ నుంచే కార్యనిర్వహణ చేయనున్నాయి.
అమరావతి నిర్మాణం వేగంగా..
ప్రస్తుతం అమరావతిలో ₹49,499.52 కోట్ల విలువైన 79 నిర్మాణ ప్రాజెక్టులు శరవేగంగా కొనసాగుతున్నాయి. మొత్తం ₹54,693.09 కోట్ల విలువ గల 90 పనులకు అనుమతులు లభించగా, ఇంకా 7 టెండర్ల ప్రక్రియలో ఉన్నట్లు సమాచారం. అదనంగా ₹36,577 కోట్ల విలువైన 20 పనులకు అనుమతుల కోసం వేచి ఉన్నారు.
రైతుల sacrifice కు గౌరవంగా… పాలన నేరుగా అమరావతి నుంచే
రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు పిలుపుగా – ప్రజలకు సేవ అందించే సరికొత్త శాసన, పరిపాలనా యుగం అమరావతిలో ప్రారంభమవుతోంది. అభివృద్ధికి నాంది పలుకుతూ సీఎం చంద్రబాబు నాయుడు రేపు ఈ కొత్త పాలనా భవనాన్ని ప్రారంభించనున్నారు.







