GUNTUR NEWS: నూరు శాతం ఆస్తి పన్ను వసూళ్లు జరగాలి – కమిషనర్ పులి శ్రీనివాసులు
GUNTUR COMMISSIONER MEETING
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో ఆస్తి పన్ను నూరు శాతం వసూళ్లు జరగాల్సిందేనని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదివారం సెట్ కాన్ఫరెన్స్ ద్వారా డిప్యూటీ కమిషనర్లు, రెవెన్యూ అధికారులు, ఇన్స్పెక్టర్లు, అడ్మిన్ కార్యదర్శులకు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, మార్చి నెల ప్రారంభమైనందున రెవెన్యూ విభాగ ప్రతి అధికారి పన్ను వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. పన్ను బకాయి ఉన్న ప్రైవేట్ ఆస్తుల్లో రూ.165 కోట్లకు ఇప్పటి వరకు రూ.90 కోట్లు వసూళ్లు జరిగిందని, మార్చి చివరికి మరో రూ.50 కోట్లు వసూళ్లు చేయాలన్నారు. పన్ను వసూళ్లకు రెవెన్యూ ఇన్స్పెక్టర్, రెవెన్యూ అధికారి, డిప్యూటీ కమిషనర్ల వారీగా రోజువారీ లక్ష్యాన్ని నిర్దేశించామని, అందుకు తగిన విధంగా క్షేత్ర స్థాయిలో వసూళ్లు జరగాలన్నారు. పెద్ద మొత్తంలో బకాయిలు ఉన్న వాటికి డిప్యూటీ కమిషనర్లు భాధ్యత తీసుకోవాలని, పన్ను వసూళ్లు అధిక ప్రాధాన్యత అయినందున విధుల్లో నిర్లక్ష్యంగా ఉంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గుంటూరు నగర ప్రజలు తమ ఆస్తి, ఖాళీ స్థల, నీటి కుళాయి చార్జీలను సకాలంలో చెల్లించాలని, తద్వారా నగరంలో అభివృద్ధి పనులు వేగంగా జరిగేందుకు వీలు కల్గుతుందన్నారు. ఇప్పటికే 2024-25 రెండవ అర్ధ సంవత్సరం చివరికి వచ్చామని, నెలాఖరు వరకు వేచి ఉండకుండా నగరపాలక సంస్థకు బకాయిలు మొత్తం చెల్లించాలని, ఏప్రిల్ 1 నుండి పన్ను పై నెలకు రూ.100కు రూ.2 వడ్డీ జమ అవుతుందన్నారు. మార్చి నెలలో సెలవు రోజుల్లో కుడా క్యాష్ కౌంటర్లు యధావిధిగా పని చేస్తాయని, పన్నులను జిఎంసి ప్రధాన కార్యాలయం, సర్కిల్ కార్యాలయంల్లోని క్యాష్ కౌంటర్లతో పాటుగా, భారత్ పేటలోని 140 సచివాలయంలోని క్యాష్ కౌంటర్లలో చెల్లించవచ్చన్నారు. కావున నగర పాలకసంస్థకు చెల్లించవలసిన ఆస్తి పన్ను, నీటి పన్ను, ఖాళీ స్థలం పన్ను, నీటి మీటర్ చార్జీలు, డి అండ్ ఓ ట్రేడ్ లైసెన్స్ లు చెల్లించి నగర అభివృద్ధికి సహకరించాలని కోరారు.