
అమరావతి: డిసెంబర్ 11:-అమరావతిలో ఏర్పాటవుతున్న క్వాంటం వ్యాలీ రాష్ట్రాన్ని ఆధునిక పరిశోధనల కేంద్రంగా నిలబెట్టేలా మారాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. విద్య, వైద్యం, కొత్త ఔషధాల రూపకల్పన, మెటీరియల్ సైన్స్ వంటి విభిన్న రంగాల్లో క్వాంటం టెక్నాలజీ భారీ మార్పులు తీసుకురావగలదని పేర్కొన్నారు

.గురువారం సచివాలయంలో వివిధ దేశాల నుంచి వచ్చిన పరిశోధకులు, విద్యావేత్తలు, ఔత్సాహిక స్టార్టప్ ప్రతినిధులు ముఖ్యమంత్రిని కలిసి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గ్లోబల్ క్వాంటం బయో ఫౌండ్రీ ప్రతినిధులు అమరావతిలో దేశంలోనే తొలి క్వాంటం బయోమెడికల్ రీసెర్చ్ ఎకో సిస్టంను ఏర్పాటు చేసేందుకు సిద్ధమని సీఎంకు వివరించారు. రూ.200 కోట్ల పెట్టుబడితో మాలిక్యులర్ మోడలింగ్, డ్రగ్ డిస్కవరీ సిమ్యులేషన్స్, మెటీరియల్ సైన్స్ పరిశోధనలు చేపట్టనున్నట్లు వెల్లడించారు.

వైద్యారోగ్య విభాగంలో నూతన ఔషధాల తయారీతో పాటు బయోసెన్సార్లు వంటి అప్లికేషన్లను కూడా ప్రజలందరికీ అందుబాటులోకి తేవాల్సిన అవసరం ఉందని సీఎం సూచించారు. త్వరలోనే అమరావతిలో క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ కార్యకలాపాలు ప్రారంభమవుతాయని తెలిపారు. ఐబీఎం, టీసీఎస్, ఎల్ అండ్ టీ సంస్థలు ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు.నేషనల్ క్వాంటం మిషన్ అవకాశాన్ని అందిపుచ్చుకుని అమరావతిలో పూర్తి స్థాయి క్వాంటం ఎకోసిస్టంను అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. గతంలో ఐటీ, జీనోమ్ వ్యాలీలను ప్రపంచానికి పరిచయం చేసినట్లే ఇప్పుడు క్వాంటం రంగంలోనూ ఏపీ ముందంజలో ఉండబోతోందని పేర్కొన్నారు.క్వాంటం వ్యాలీ సేవలను వ్యవసాయం, వైద్యం, రక్షణ, రవాణా, విద్య వంటి అన్ని రంగాలకు విస్తరించేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.

రాష్ట్రంలోని ఐఐటీలు, విశ్వవిద్యాలయాలు, రీసెర్చ్ సంస్థలకు అమరావతి క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ ప్రధాన కేంద్రంగా పనిచేయనుంది.ఏపీలో అమలవుతున్న పారదర్శక విధానాలు తమను ఆకట్టుకున్నాయని గ్లోబల్ క్వాంటం బయోఫౌండ్రీ ప్రతినిధులు ముఖ్యమంత్రికి తెలియజేశారు.







