
విజయవాడ :-అమరావతిలో మహాత్మా జ్యోతిరావు పూలే స్మృతి వనాన్ని ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత తెలిపారు. వచ్చే ఏప్రిల్ 11న జ్యోతిరావు పూలే 200వ జయంతిని పురస్కరించుకుని సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా స్మృతి వనం నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్లు వెల్లడించారు.

బీసీల అభ్యున్నతే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్న మంత్రి, అన్ని జిల్లా కేంద్రాల్లో బీసీ భవనాల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇప్పటికే జిల్లాల కలెక్టర్లకు స్థలాలు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. బీసీ స్టడీ సర్కిళ్లు లేని జిల్లాల్లో నూతన స్టడీ సర్కిళ్లను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.
అమరావతిలో ఐదు ఎకరాల్లో రాష్ట్ర స్థాయి బీసీ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయనున్నామని, దీనికి మహాత్మా జ్యోతిరావు పూలే పేరు పెట్టనున్నట్లు మంత్రి తెలిపారు. బడుగు, బలహీన వర్గాల ఆత్మగౌరవాన్ని కాపాడటమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.

విజయవాడ గొల్లపూడిలోని బీసీ భవన్‌లో పలు బీసీ సంఘాల ప్రతినిధులతో మంత్రి సవిత సమావేశమయ్యారు. 19 నెలల కూటమి పాలనలో బీసీల కోసం అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ఈ సందర్భంగా వివరించారు. బీసీలకు మరింత ఆర్థిక భరోసా కల్పించేలా సంఘాల వారీగా అభిప్రాయాలు సేకరించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, టీడీపీ పాలనలోనే బీసీలకు ఆర్థిక, సామాజిక, రాజకీయ గుర్తింపు లభించిందన్నారు. అన్న ఎన్టీఆర్ స్ఫూర్తితో సీఎం చంద్రబాబు నాయుడు బీసీల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని తెలిపారు. కులవృత్తిదారులకు ఆదరణ, ఆదరణ 2.0 అమలు చేశామని, త్వరలో రూ.1000 కోట్లతో ఆదరణ 3.0 పథకం ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.

బీసీల ఆత్మగౌరవానికి భంగం కలగకుండా త్వరలో బీసీ రక్షణ చట్టానికి తుది రూపు ఇస్తున్నట్లు మంత్రి సవిత తెలిపారు. బీసీ హాస్టళ్లలో ఆర్వో ప్లాంట్లు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, సాంకేతిక విద్య కోసం కంప్యూటర్ ల్యాబ్‌లు అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. సివిల్ సర్వీసెస్, మెగా డీఎస్సీ కోసం ఉచిత కోచింగ్ అందిస్తున్నట్లు పేర్కొన్నారు.Vijayawada Local news
డీఎన్టీ కులాల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, కుల గణన కోసం త్వరలో డెడికేషన్ కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. బీసీల సమస్యల పరిష్కారానికే ఈ సమావేశం నిర్వహించామని తెలిపారు.
ఈ సమావేశంలో వివిధ బీసీ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.










